దారి తప్పుతున్న రాజకీయాలు

`ఇద్దరి మధ్య పోరు మరొకరిని దెబ్బతీసున్న వైనం

`పై స్థాయిలో ఉన్నవారి వ్యాఖ్యలు కట్టు తప్పకూడదు

`నటులూ మనుషులే…వారికీ భావోద్వేగాలుంటాయి

`విపరీత ఆరాధన విద్వేషానికి దారితీస్తుంది

`హద్దులు మీరుతున్న సోషల్‌ మీడియా పోస్టులు

`వ్యక్తిగత జీవితాలను టార్గెట్‌ చేయకూడదు

`విమర్శించేముందు తగిన జాగ్రత్తలు అవసరం

విధానపరమైన విమర్శలతో పార్టీలు తమ రాజకీయాలను కొనసాగించి నట్లయితే ప్రజలు కూడా చైతన్యవంతులై, ఆయా విధానాలను పరిశీలించి తమకు నచ్చిన పార్టీకి ఓటేయడమనేది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య లక్షణం. కొన్నిసార్లు అవి గాడితప్పి వ్యక్తిగత దూషణల దిశగా పయ నించినప్పుడు పెను వివాదాలకు దారితీస్తాయి. ముఖ్యంగా సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవారు చేసే వ్యాఖ్యలకు ఎప్పుడూ విలువ వుంటుంది. ఇప్పుడు తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే సృష్టించాయి. నిజానికి ఆమె లక్ష్యం కె.టి.ఆర్‌! కానీ దెబ్బ తగిలింది స మంతకు! నిజంగా ఒకరిని టార్గెట్‌ చేస్తే మరొకరు బలవుతారన్న దానికి ఇది గొప్ప ఉదాహరణ. ఇక్కడ కొండా సురేఖను కూడా అనడానికి లేదు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులే కొండాసురేఖ ఇంతగా రియాక్ట్‌ కావడా నికి ప్రధాన కారణమని ఆమె మద్ద తుదార్లు సమర్థించుకోవచ్చు. నాలుగు రోజులుగా వరుసగా వస్తున్న ట్రోలింగ్స్‌ కారణంగా సహనం కోల్పోయి ఆమె కె.టి.ఆర్‌.ను టార్గెట్‌ చేసిన విమర్శల బాణాలు సమంతకు తగలడం ఇప్పుడు సమస్యకు ప్రధాన కారణం. చివరకు ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో వివాదానికి తెరపడినప్పటికీ, ఈ దుమారం సృష్టించిన విధ్వంసం తాలూకు ఆనవాళ్లు వెంటనే సమసిపోవు. ఎందుకంటే దీన్ని సెన్సేషన్‌ చేసి ఏదో సాధించామన్న ఆత్మసంతృప్తి పొందే ప్రబుద్ధులు ఇటువంటి పనికిమాలిన అంశాలను తర్వాతి తరాలవాళ్లకు కూడా తమదైన శైలిలో అందించడానికి ప్రయత్నిస్తూనే వుంటారు. విచిత్రమేమంటే…రాజకీయ వ్యవస్థలోని రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య వున్న వివాదంలోకి, సినీపరిశ్రమ అనే మూడో వ్యవస్థను లాగడమే ఇక్కడ ప్రధాన సమస్య! ఒక మహిళగా తనపై సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టులకు కొండా సురేఖకు ఆగ్రహం రావడం సహజమే. కాకపోతే బాధ్యతాయుతమైన మంత్రిపదవిలో వుంటూ, తాను చేస్తున్న విమర్శలు సాటిమహిళ వ్యక్తిత్వ హననానికి కారణమవుతున్నాయని గుర్తించకపోవడం విచారక రం. ట్రోలింగ్‌లపై తానెంత మనోవ్యధకు గురైందో, తన వ్యాఖ్యలవల్ల మరో మహిళ కూడా అదే విధమైన బాధను అనుభవిస్తుందన్న సత్యాన్ని గుర్తించకపోవడానికి ఆమెలోని కట్టలు తెంచుకు న్న ఆవేశం కారణం కావచ్చు. ఆమె ఆగ్రహం కె.టి.ఆర్‌.పైనే అన్నది స్పష్టం. కానీ దెబ్బ తగులుతున్నది సమంత, అక్కినేని నాగార్జున కుటుంబానికి అనేది గుర్తించకపోవడం తప్పిదం. ఇదిలా వుండగా బి.ఆర్‌.ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు కొంతకాలంగా ఈ ఎపిసోడ్‌పై మౌనాన్ని పాటించినప్పటికీ, మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ వివాదానికి ముగింపు పలకాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌ సినీపరిశ్రమను కోరడం ద్వారా పరిస్థితిని మరింత చేయిజారి పోకుండా జాగ్రత్తపడ్డారనే చెప్పాలి. బహుశా పార్టీకి నష్టం వాటిల్లుతున్నదని ఆయన గుర్తించి తెలివిగా ముందడుగు వేశారనే చెప్పాలి. అంత ఆవేశంగా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంలో, కాంగ్రెస్‌ పెద్దలు తమవంతు పాత్ర పోషించి వుండవ చ్చు కూడా! అయితే ఇక్కడ మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని మాత్రమే చెప్పా రు. క్షమాపణలు కోరలేదన్నది గమనార్హం!

ఉలిక్కిపడిన సినీ పరిశ్రమ

సోషల్‌ మీడియాలో పోస్టులపై తనకు, బి.ఆర్‌.ఎస్‌. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.టి.ఆర్‌కు మధ్య జరుగుతున్న ఈ వివాదంలో సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబాన్ని సురేఖ వీధిలోకి లాగారు. నాగచైతన్య`సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కె.టి.ఆర్‌. అని ఆమె చేసిన తీవ్ర వ్యాఖ్య లు సినీ పరిశ్రమను ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఇక్కడ సురేఖ ప్రధాన లక్ష్యం కె.టి.ఆర్‌. కానీ దెబ్బతగిలింది నాగార్జునకు. అయితే మొదట్లో సినీపరిశ్రమ ఈ వ్యాఖ్యల విషయం లో నాగార్జునకు అండగా ముందుకు రాలేదు. కాకపోతే తర్వాత ఒక్కరొక్కరుగా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ వచ్చారు. తక్షణ స్పందనకు, నింపాదిగా స్పందించినదానికి ఎంతో తేడా వుంటుంది.ఒక స్థాయిలో వుండి సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల వ్యవహారశైలి ఎంతో జాగ్రత్తగా వుండాలి. పొరపాటు చేసినా దానికి విపరీత అర్థాలు తీసి నానా రచ్చచేసేవాళ్లు సమాజంలో ఎ ప్పుడూ వుంటారు. అనర్థం జరిగిపోయిన తర్వాత ఏం చేసినా ఫలితం వుండదు. గతంలో వల్లభనేని వంశీ లోకేష్‌ను టార్గెట్‌ చేస్తూ చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు దంపతులకు తగిలింది. తర్వాత ఆయన సారీ చెప్పినా అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో టి.డి.పి., వైస్‌.ఎస్‌.ఆర్‌.పి.ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటంలో తిరుపతి లడ్డూను లాగారు. ఇందులో ఎవరు రాజకీయ లబ్డి పొందారన్నది కాదు ప్రశ్న. ఈ రాజకీయ జగడంలో హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారన్నది మాత్రం సుస్పష్టం.

నటులూ మనుషులే

సమాజంలో వివిధ రకాల వ్యక్తులు వేర్వేరు వృత్తుల్లో స్థిరపడి ముందుకు సాగుతుంటారు. ఇది సహజం. అందరూ ఒకే వృత్తిలో కొనసాగలేరు కదా! వీటిల్లో సినిమా, మీడియా, రాజకీయాలు, ప్లీడర్‌ వృత్తుల్లో ఉన్నవారికి ప్రజలతో సంబంధాలుంటాయి. ముఖ్యంగా మీడియా, రాజకీయాలు సమాజంపై తక్షణ ప్రభావాన్ని చూపుతాయి. ఇక ప్లీడర్‌ వృత్తి లిటిగేషన్‌ వ్యవహారాల పరంగా ప్రజలతో సంబంధాన్ని కలిగివుంటే, వినోదాన్ని పంచే సినిమా పరిశ్రమ పండితుల నుంచి పామరుల వరకు తనదైన ముద్రను వేస్తోంది. 64 కళల్లో నటన కూడా ఒకటి. ఒక పాత్రలో ఇమిడి పోయి ప్రభావశీలకంగా నటించడం అంత తేలికైన విషయం కాదు. పుట్టుకతో లేదా కఠోర సాధనతో మాత్రమే అంతటి నైపుణ్యం సాధ్యం. సినిమాల్లో చూపే పాత్రలు చాలావరకు సమాజం తో ముడిపడేవే వుంటాయి. ఫలితంగా జనం మనో ఫలకాలపై ఆయా పాత్రలు, వాటిల్లో నటించే నటుల ప్రభావం గాఢంగా వుంటుంది. అయితే ఒక నటుడిలోని నటనా కౌశలాన్ని గౌరవించడం కంటే, పాత్రల్లో ఒదిగిన నటులను ఆరాధించడం తెలుగురాష్ట్రాలు, తమిళ నాడుల్లో బాగా కనిపిస్తుంటుంది. ఫలితంగా నటుల వ్యక్తిగత జీవితాలు కూడా జనాల్లో చర్చనీయాంశాలుగా మా రుతుంటాయి. ఎం.జి.ఆర్‌, జయలలిత, ఎన్టీఆర్‌ వంటి తెరవేల్పులు రాజకీయానుభవంతో సం బంధం లేకుండా ఛరిష్మాతో అధికార పీఠాన్ని అధిరోహించగలగడం వెనుక కారణం ఇదే. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ కూడా ఇదే కోవకు వస్తారు. నటులు కూడా మనుషులేనని, వారు తమ వృత్తిలో మాత్రమే కొనసాగుతున్నారని, సాధారణ మనుషుల్లాగానే వారికీ భావోద్వేగాలుంటాయన్న సత్యాన్ని జనం గుర్తించడం మొదలుపెడితే, వారిపట్ల ఉన్న ఆరాధనా భావం, క్రమంగా నటుల్లోని నటనా కౌశలాన్ని గుర్తించే స్థాయికి ఎదుగుతుంది. అప్పుడు నటనపై తప్ప నటుడిపై అంతగా దృష్టిపెట్టే పరిస్థితి రాదు. ఆరాధన ఒక పరిమితిని మించిపోయినప్పుడు అభిమానసంఘాలు పుట్టుకొస్తాయి. నటులు చేసే ప్రతి వ్యాఖ్యను వీరు ప్రామాణికంగా తీసుకునే దశ వస్తుంది. ఈ స్థాయిలో తమ అభిమాన నటుడిని ఎవరు ఏమన్నా తట్టుకోలేని స్థితి వచ్చి గొడవలకు, ఘర్షణలకు కారణమవుతారు. ఈ దుస్థితి మారాల్సిన అవసరం ఉంది. నటులు తమ కుటుంబం కోసం కష్టపడి వృత్తిలో రాణించడానికి కృషి చేస్తుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ భవి ష్యత్తు కోసం తాము నమ్ముకున్న వృత్తిలో కృషిచేస్తే రాణింపు పొందవచ్చు. దీన్ని గుర్తించి సమా జంలోని వ్యక్తులు మెలగాలి. ఆ స్థాయికి మన సమాజం ఇంకా ఎదగాలి.

వ్యక్తిగత విభేదాలతో రచ్చ

ప్రస్తుతం ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య నెలకొన్న విభేదాల వల్ల, రెండు పార్టీల కార్యకర్తలు మాత్రమే కాదు, సినీ అభిమానులు కూడా వీధుల్లోకి వచ్చి తమ నాయకులు, అభిమాన నటుల తరపున గొడవకు దిగడానికి వెనుకాడని పరిస్థితి ఏర్పడిరది. ఇది కొండా సురేఖ, కె.టి.ఆర్‌. మధ్య వున్న నెలకొన్న వివాదంగా రెండు పార్టీల కార్యకర్తలు పరిగణించినట్లయితే రెండు పార్టీల ఇమేజీ దెబ్బతినదు. అదేవిధంగా సినీ అభిమానులు నటుల వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లకుండా వుంటే సమస్యే వుండదు. ఇంతా చేస్తే పెద్దస్థాయిలో ఉన్న నటులు ట్విట్టర్ల ద్వారానో లేదా ఒక చిన్న ప్రెస్‌ మీట్‌ ద్వారానో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసి మిన్నకుండిపోతారు. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, అభిమానులు పరస్పరం దాడులకు పాల్పడుతుంటారు. దీనివల్ల ఒరిగేదే మీ లేదు. నేమ్‌ అండ్‌ ఫేమ్‌పై దృష్టిపెట్టేవాళ్లంతా బాగానే వుంటారు. నష్టపోయేది క్షేత్రస్థాయిలోని వారు మాత్రమే!

మహిళలే బాధితులు

హీరోయిజంపై విపరీత అభిమానం పెంచుకున్న వారి సంఖ్య అధికంగా వున్నంతకాలం హీరో యిన్లకు పాట్లు తప్పవు. ఉదాహరణకు నాగచైతన్య`సమంత విడాకులు తీసుకుని చాలాకాలమై నా సమంతకు సోషల్‌ మీడియా తిప్పలు తప్పడంలేదు. రేణుదేశాయ్‌ కూడా పవన్‌ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తీవ్రస్థాయిలో ట్రోలింగ్‌లకు గురయ్యారు. జయం రవి తన భార్య ఆర్తినుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన దగ్గరినుంచి ఆర్తిపై సోషల్‌ మీడియాలో పోస్టులు మొదలయ్యాయి. ఈ విషయాల్లో మెగాస్టార్లు, సూపర్‌స్టార్ల కుమార్తెలైనా ఫ్యాన్స్‌ పేరుతో చేసే మూర్ఖపు విమర్శల బారినుంచి తప్పించుకోలేపోయారు. అందువల్ల ఒక స్థాయికి వెళ్లిన తర్వాత సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా వుండే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే హీరోయిన్లకు ఇబ్బందులు తప్పవు. ఇక్కడ రాజకీయాల్లో వుండే మహిళలకు ప్రత్యర్థుల నుంచి సోషల్‌ మీడియా పోస్టుల రూపంలో దాడులు మొదల వుతాయి. ఇందుకు ప్రస్తుత ఉదాహరణ కొండా సురేఖ. ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో జయప్రద కూడా ఇటువంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. తట్టుకొని నిలబడ టం ఆమె ఘనత!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *