కేసీఆర్ నయా ప్లాన్
27న బ్లూప్రింట్ విడుదల
కాంగ్రెస్ పాలనకు రెండున్నరేళ్లు పూర్తయ్యాయి… కానీ అసలు రాజకీయ కథ ఇప్పుడు స్టార్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఫాంహౌస్‌కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఒక్కసారిగా బయటకు రావడం… అదే సమయంలో జీవన్ రెడ్డి చేరిక… ఇవన్నీ కలిసి కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ మెసేజ్‌గా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. జగిత్యాల సభతో వచ్చిన మైలేజీతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం ప్రభుత్వానికి సమయం ఇచ్చామని.. ఇక ఊరుకునేది లేదని గులాబీ కేడర్‌ను ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.ఈ క్రమంలోనే పార్టీ బలోపేతం, భవిష్యత్ వ్యూహాలపై దృష్టి సారిస్తూ ఈనెల 27న మధ్యాహ్నం తెలంగాణ భవన్లో ముఖ్య సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు.
అదే రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడం, రజతోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమాన్నీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ భవిష్యత్ బ్లూప్రింట్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. సంస్థాగత నిర్మాణం నుంచి సభ్యత్వాల పునరుద్ధరణ వరకు… జిల్లా, మండల స్థాయిలో కొత్త లీడర్షిప్ యాక్టివేషన్ వరకు… ప్రతి అంశంపై డీప్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తారని టాక్. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ కేడర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలి? అనే విషయాలపై దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా, మండల స్థాయిలోనూ పార్టీ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం, నాయకత్వాన్ని చురుకుగా మార్చడం వంటి అంశాలు ఎజెండాలో ఉండనున్నట్టు తెలుస్తున్నది.
కొత్త సభ్యులను ఆకర్షించడం, యువతను పార్టీలోకి తీసుకురావడం, గ్రామస్థాయి వరకు పార్టీ విస్తరణ జరగాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించే దిశగా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తున్నది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ప్రణాళికలు చేస్తున్నట్టు తెలిసింది.ఈ సభల ద్వారా పార్టీ శక్తిని ప్రదర్శించడంతో పాటు ప్రజలతో నేరుగా మమేకం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. ఈ బహిరంగ సభలు పార్టీకి మళ్లీ ఉత్సాహాన్ని నింపే అవకాశమున్నదని నేతలు భావిస్తున్నారు.
