kagitham recycling andivachina varam, కాగితం రీసైక్లింగ్‌ అందివచ్చిన వరం

కాగితం రీసైక్లింగ్‌ అందివచ్చిన వరం

కాగితం నిత్యజీవితంలో ప్రముఖపాత్రను పోషిస్తుంది. టిష్యూ పేపర్‌ మొదలుకుని, వార్తపత్రిక వరకు కాగితాన్నే వాడుతారు. కాగితానికి ఉన్న ప్రాధాన్యత అంతా…ఇంతా కాదు. ఇది లేనిది ఏ పని నడవదు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ప్రభుత్వ కార్యకలాపాలు నడవాలన్న, పాలనపరమైన పనులు సజావుగా కొనసాగాలన్న, ఏ విషయంలోనైనా మనిషికి భరోసా, నమ్మకం కలగాలన్న పేపర్‌ ప్రముఖపాత్రను పోషిస్తుంది అనుకున్న విషయాన్ని కాగితంపై ఉంచితే మనిషి మాటకన్న కాగితంపై ఉన్న మాటలే ఎక్కువ విలువను కలిగి ఉంటాయనడంలో ఎంతమాత్రం సందేహం కలగదు. ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న పేపర్‌ మనకు కలప నుంచే లభిస్తుంది. కాగితం తయారీ కర్మాగారాలు కలప గుజ్జు నుంచి కాగితాన్ని తయారుచేస్తారు. కొన్ని కర్మాగారాల యజమానులు కాగితం తయారీ కోసం ప్రత్యేకంగా చెట్లను పెంచి గుజ్జును తీసి కాగితాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా చేసేందుకు అందని సందర్భంలో లేదా మరింతగా కాగితాన్ని తయారు చేసేందుకు వృక్షాలను కొనుగోలు సైతం చేస్తున్నారు. అయితే కాగితం ఉత్పత్తి మూలంగా పర్యావరణానికి హాని కలుగుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు కాగితాన్ని తయారు చేయడానికి చెట్లే ఆధారంగా కనపడుతున్నాయి తప్ప మరో ప్రత్యామ్నాయమార్గం కనపడడం లేదు. దీని వల్ల చెట్లను కాగితం తయారీకి వాడక తప్పడం లేదని తయారీ కర్మాగార యజమానులు అంటున్నారు. అయితే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మూలంగా, కంప్యూటరీకరణ కారణంగా కాగితం వాడకం తగ్గిందని అంటున్న ఆశించినంత మేర తగ్గలేదు. పైగా కాగితానికి ఉన్న ప్రాధాన్యత అలాగే ఉండిపోయింది. టెక్నాలజీ ఎంతగా వచ్చిన కాగితం వాడకం తగ్గలేదన్నది నిజంగా నిజం. ఇది ఇలా ఉంటే కాగితం తయారీకి కలపను విరివిగా ఉపయోగిస్తున్నారని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా కాగితం తయారీ పరిశ్రమలో ఓ మార్పు చోటు చేసుకుంది. రీ సైక్లింగ్‌ ద్వారా పేపర్‌ను ఉత్పత్తి చేయడం కర్మాగారాలు ప్రారంభించడంతో భారీ ఊరట కలిగింది. రీసైక్లింగ్‌ కాగితం వాడకం విషయంలో వినియోగదారులకు అవగాహన కలగడంతో కలపను గతంలో కంటే చాలా తక్కువగానే వాడుతున్నారు. దీనివల్ల కొంతమేర ఉపశమనం కలిగిందనే చెప్పుకోవచ్చు. రీసైక్లింగ్‌ పేపర్‌ను వినియోగదారులు ఉపయోగించడంలో మరింత చైతన్యాన్ని ప్రదర్శిస్తే ఈ కాగితానికి ఎక్కువ గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల అటు పర్యావరణానికి కానీ ఇటు వృక్షాలకు కానీ ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశం ఎంతమాత్రం ఉండదు. అందుకే రీసైక్లింగ్‌ పేపర్‌ వాడకాన్ని మరింతగా పెంచేలా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది.

రీసైక్లింగ్‌తో ముప్పు తగ్గుతుంది

– ఠాకూర్‌ కిషన్‌సింగ్‌

రీసైక్లింగ్‌ పేపర్‌ మూలంగా పర్యావరణానికి ముప్పు తగ్గుతుందని పేపర్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు ఠాకూర్‌ కిషన్‌సింగ్‌ అన్నారు. కాగితం వాడకం గూర్చి ‘నేటిధాత్రి’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన కాగితం తయారీకి ప్రత్యామ్నాయ ముడిసరుకు ఏది లేకపోవడం ఒకింత బాధాకరమేనన్నారు. అయితే పేపర్‌ ఉత్పత్తిలో రీసైక్లింగ్‌ రావడం శుభపరిణామం అన్నారు. రీసైక్లింగ్‌ వల్ల కలప వాడకాన్ని అధికశాతం నియంత్రించవచ్చన్నారు. అయితే వినియోగదారులు సైతం రీసైక్లింగ్‌ పేపర్‌ వాడకంలో శ్రద్ద కనబర్చాలని ఈ కాగితంపై అవగాహన పెంచుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *