gudiselu veinchi…beram kudurchuco…,గుడిసెలు వేయించి…బేరం కుదుర్చుకో…

గుడిసెలు వేయించి…బేరం కుదుర్చుకో…

నిలువ నీడలేని పేదలను కొందరిని చేరదీస్తారు. చెప్పింది వినాలంటారు. ప్రభుత్వభూమినో, ప్రైవేటు భూమినో చూపిస్తారు. ఇందులో మీకు జాగ ఖాయం అంటారు. దీనిని చదును చేస్తే మనం గుడిసెలు వేసుకోవచ్చని నమ్మకంగా చెప్తారు. నిలువ నీడ దొరుకుతుంది. నగరంలో ఓ ఇల్లు కట్టుకోవచ్చని పేదలు చెప్పిన ప్రతీ దానికి తలలూపుతారు. మరీ భూమిని చదును చేయాలి, జెండాలు పాతాలి, పోలీసులను ఎదుర్కొవాలి. ఇదంతా చేయాలంటే ముందుగా చేతిలో ఎంతో కొంత పైకం ఉండాలి. ఇంకేముంది చేరదీసిన ప్రజల వద్ద నుంచే తలా కొన్ని పైసలు వసూలు చేస్తారు. ఇక్కడ మొదలవుతుంది. వసూళ్ల పర్వం వంద నుంచి మొదలైన ఈ పర్వం డిమాండ్‌ను బట్టి వేలకు చేరుకుంటుంది. పొద్దస్తమానం కష్టపడి సంపాదించిన సొమ్మును నిలువ నీడ కోసం పేదలు అక్కడి నాయకులకు సమర్పించుకుంటారు. కష్టనష్టాలకోర్చి గుడిసెలు వేసుకుంటారు. ఒకటి, రెండు రోజులు చూసి ప్రభుత్వభూమి అయితే రెవెన్యూ అధికారులు, పోలీసుల సహాయంతో గుడిసెలు తొలగిస్తారు. అడ్డుకుంటే ఈడ్చి అవతల పారేస్తారు. డబ్బులు వసూలు చేసి గుడిసెలు వేయడానికి నాయకత్వం వహించిన నాయకులు సైతం అధికారులకు ఎదురుతిరుగుతారు. పోలీస్‌ వ్యాన్‌ ఎక్కుతారు. ఇదంతా బాగానే ఉన్నా తెల్లవారి నుంచి గుడిసెల పోరాటం మాట వినపడదు. చివరకు పేదలు, గుడిసె కోసం చెమటోడ్చి తమ కష్టార్జితం చేతిలో పెట్టినవారు నష్టపోతారు. నాయకులు మాత్రం వసూళ్ల పైసలతో హాయిగా ఉంటారు. ఇక ప్రైవేట్‌ స్థలం అయితే కథ వేరే విధంగా ఉంటుంది. వారం, పదిరోజులపాటు గుడిసెలు వేసి తమకు పేద ప్రజల అండ ఉందని నిరూపించుకుని బేరసారాలకు దిగుతారు. యజమానితో కుమ్మకైతారు. అదే రియలెస్టేట్‌ వెంచర్‌ అయితే డిమాండ్‌ భారీగానే పెట్టి తమ జేబులు నింపుకుని గుడిసెలు వేసిన వారికి ఏవో మాయమాటలు చెప్పి తప్పుకుంటారు. గుడిసెల స్థలంలో వారం, పదిరోజుల్లో అందమైన భవంతులు, అపార్టుమెంట్లు వెలుస్తాయి. ఇక్కడ చివరకు పేదలే ఓడిపోతారు. నాయకులు ఆర్థికంగా లాభపడి హాయిగా ఉంటారు. ఇదంతా గుడిసెల పేరుతో జరుగుతున్న పోరాటాల్లో తరుచుగా కనపడుతున్న మోసాలు. నిలువ నీడ లేని పేదలకు ఎంతో కొంత జాగ కోసం పోరాటం చేయడం సరైందే అయిన కేవలం తమ పార్టీల కోసం డబ్బులు రాబట్టుకోవడం కోసం కొందరు కమ్యూనిస్టుల పేరుతో ఎర్రజెండాను అడ్డుగా పెట్టుకుని దిగజారుడు పద్దతులు అవలంభించడం నిజంగా క్షమించరాని నేరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *