CPI Protest Against Fuel Price Hike
గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ పార్టీ ఆందోళన…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని క్యాతనపల్లి ఎక్స్ రోడ్డు వద్ద గల జాతీయ రహదారిపై రామకృష్ణాపూర్ పట్టణ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లు పట్టుకొని రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా గ్యాస్ పెట్రోల్ డీజిల్ పై ధరలు పెంచడానికి నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించడం జరిగిందని అన్నారు. ధరలు పెంచడంతో మధ్యతరగతి సామాన్యులకు భారంగా ఉంటుందని అన్నారు. ప్రధాని అలసత్వం వల్లనే ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహించారు. వర్తక, వాణిజ్య సంస్థలపై, రవాణా సంస్థల మీద సైతం భారం పడి నిత్యవసర సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉందని మండిపడ్డారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు లింగయ్య, సాంబయ్య, మొండి, వనం సత్యం, మిట్టపల్లి పౌల్, కౌన్సిలర్లు మద్దెల శంకర్, ఇరవేణి రవి, రాజం, రమేష్, హుస్సేన్ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
