ఏసిబి వలలో అవినీతి అధికారి.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శేరిలింగంపల్లి జోనల్ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్
ఏసీబీ రైడ్స్ తో మిగతా విభాగాల అధికారులు పరారు…
శేరిలింగంపల్లి, నేటి,ధాత్రి :-
ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. శేరిలింగంపల్లి జోనల్ జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం మధ్యాహ్నం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ డి.ఎస్.పి శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టింది. అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గత కొంతకాలంగా చాంద్రాయణ గుట్ట సర్కిల్ లో అర్బన్ బయోడైవర్సిటి విభాగం ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.

చాంద్రాయణ గుట్ట సర్కిల్ పనికి సంబంధించి ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 2 లక్షల 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. కాగా ఇదివరకే రూ. 1 లక్ష 50 వేలు పలు దఫాలుగా తీసుకున్నాడు. ఒప్పందం ప్రకారం మిగతా రూ. 50 వేలు ఇచ్చేందుకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి రావాలని సూచించాడు. దీంతో కాంట్రాక్టర్ శ్రీనివాస్ తెలిపిన విధంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని ఛాంబార్ కు వచ్చాడు. కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శ్రీనివాసుని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డి.ఎస్.పి శ్రీధర్ తెలిపారు.

ఏసీబీ రైడ్స్ తో మిగతా విభాగాల అధికారులు పరారు…
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారి పై ఏసీబీ రైట్స్ జరగడంతో, జోనల్ కార్యాలయంలోని మిగతా విభాగాల అధికారులు పరారయ్యారు. ఉదయం 12 గంటల నుంచి అన్ని విభాగాల అధికారులు కార్యాలయంలో లేకపోవడంతో కుర్చీలు కాలిగా దర్శనమిచ్చాయి. అధికారులు అందుబాటులో లేకపోవడంతో పనుల పైన విచ్చేసిన ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏదో ఒక అధికారిపై ఏసీబీ దాడులు జరిగితే మిగతా అందరూ వీధిల నుంచి తప్పించుకుని వెళ్లడంపై సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఏసీబీ దాడులకు భయపడే అధికారులు పారిపోయారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
