దూకుడు, నిజాయతీలే పవన్ ఆయుధాలు
`అరుదైన నాయకుడిగా నిరూపించుకుంటున్న వైనం
`పవన్‌ను ముందుకు నడిపిస్తున్నది సనాతనధర్మమే
`బాబు తప్పిదం పవన్‌కు కలిసొచ్చింది
`పవన్‌లోని ‘ఛరిష్మా’ను రుజువు చేసిన మహారాష్ట్ర ఎన్నికలు
`జాతీయ స్థాయికి మార్గం సుగమం
`దూకుడుతో మొదలుపెట్టి పరిణితివైపు పవన్ ప్రయాణం
`భావి ఆంధ్ర రాజకీయాలను మలుపు తిప్పే సత్తాను సంతరించుకుంటున్న పవన్
`కుల రాజకీయాలనుంచి బయటపడితేనే ఏపీకి భవిష్యత్తు
హైదరాబాద్,నేటిధాత్రి:
పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించడం కూడా కష్టం. ఛరిష్మా, తెగువ, నిజాయతీ, ముక్కుసూటితనం, తన బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహన వున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ఇదే అరుదైన నాయకత్వలక్షణం. పాలనానుభవాన్ని మరింత సంపాదించే క్రమంలో ఆయన ప్రస్తుతం డిప్యూటీ ముఖ్య మంత్రి పదవితో సంతృప్తి చెందుతున్నారనే అనుకోవాలి. గత ఎన్నికల్లో ఆయన ప్రధానలక్ష్యం వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వాన్ని పడగొట్టడం. ఇందుకోసం తెలుగుదేశంతో జతకట్టారు. చంద్రబాబు రాజకీయాలపై ఎంతమాత్రం విశ్వాసంలేని భాజ పా పెద్దలతో తిట్లుతిని మరీ ఎలాగోలా ఒప్పించి ఓట్లు చీలకుండా భాజపా, తెలుగుదేశం, జనసేలు ఉమ్మడిగా ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. ఆవిధంగా జగన్‌ను దింపడమనే ఒకలక్ష్యం నెరవేరింది.
పెరుగుతున్న పరిణితి
మొదట్లో ఎంతో ఆవేశం ప్రదర్శించిన పవన్ కళ్యాణ్‌లో క్రమంగా పరిణితి కనిపిస్తోంది. తాను ముఖ్యమంత్రి పదవికి ఇంకా అర్హత సాధించలేదన్నది ఆయన అభిప్రాయం కావచ్చు. పదవి దొరికితే చాలని అనుకుంటున్న ఈ కాలంలో అర్హతపై అంచనాలతో తన స్థాయికి తగిన రీతిగా ప్రవర్తించే పరిణితిని పవన్ కళ్యాణ్ ప్రదర్శిస్తున్నారు. నిజంగా ఇది గొప్ప నాయకత్వ లక్షణం. భాజ పా నాయకత్వం కూడా దీన్ని గుర్తించే, ఆయన్ను క్రమంగా జాతీయ స్థాయి రాజకీయాల్లో ము ఖ్యంగా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారానికి పంపుతూ ఒక రకంగా శిక్షణ ఇస్తున్నదనే చెప్పాలి.ఇందుకు ఉదాహరణ మొన్నటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన ఛరిష్మా బాగా పనిచేసిందనే చెప్పాలి. ముఖ్యంగా షోలాపూర్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయన చేసిన ప్రచారం అద్భుతమైన ఫలితాలిచ్చింది. ఈ ఏడు స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. మరాఠీలో మాట్లాడటం, హిందువులు తలచుకుంటే ఏమైనా సాధించగలరు, చేయగలరన్న రీతిలో దూకుడుగా ప్రసంగించడం మరాఠా ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పూణె, షోలాపూర్, లాతూర్, నాందేడ్ ప్రాంతాల్లో పవన్‌కు ప్రజలు బ్రహ్మరథంపట్టారు. సహజంగానే ఛత్రపతి శివాజీ, హిందూత్వ బలంగా వున్న రాష్ట్ర్రం కావడంవల్ల దూకు డు వైపునకే ప్రజలు మొగ్గు చూపడం సహజం. పవన్ సహజసిద్ధ ఆవేశం ఇక్కడ కలిసొచ్చింది. జాతీయస్థాయి రాజకీయాల్లో మంచి పేరు సంపాదించాలంటే చరిష్మాతో పాటు, ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, అక్కడి ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా ప్రసంగించాల్సి వుంటుంది. అప్పుడు మాత్రమే ప్రజల్లో ఆకర్షణ పెరుగుతుంది. ఈ లక్షణాలన్నీ పవన్ కళ్యాణ్‌లోప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
భాజపా నాయకత్వానికి ఆప్తుడు
మహారాష్ట్రలో పవన్ ప్రభావాన్ని భాజపా నాయకత్వం నిశితంగా పరిశీలించింది. ఆయన్ను ప్రస్తుతం భాజపా తమ పార్టీలో ఒకడు అన్నరీతిలో పరిగణిస్తోంది. ఇక ముందు ముఖ్యంగా దక్షిణాదిరాష్ట్రాల్లో పార్టీ బలహీనంగా వున్న స్థానాల్లో పుంజుకోవడానికి పవన్ సేవలను పార్టీ నాయక త్వం ఉపయోగించుకోవచ్చు. ఆవిధంగా పవన్ రాజకీయ ప్రస్థానం జాతీయస్థాయికి ఎదిగేదిశగాముందుకు సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పవన్‌కు తనకంటూ ఒక ఛరిష్మా వుంది. అదేవిధంగా తమిళనాడు, కేరళల్లో కూడా పవన్‌కు గొప్ప ఫాలోయింగ్ వుంది. ఉదయగిరి స్టాలిన్ సనాతనధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని గట్టిగా తిప్పికొట్టారు. డిఎంకే కార్యకర్తలు పవన్‌పై నిప్పులు చెరిగినా, అక్కడి పవన్ పాలోయింగ్ గట్టిగావున్న నేపథ్యంలో మౌనం దాల్చక తప్పలేదు. కేరళలో సిపీఎంకు అతిపెద్ద అనధికారిక సోషల్ మీడియా గ్రూపుగా పరిగణించబడే షాజీ చెరియన్ ప్రొఫైల్ గ్రూపు పిక్చర్ పవన్ కళ్యాణ్‌దే. అటువంటి ఛరిష్మా వున్న ఆయనకు కావలసింది తగినంత పాలనానుభవం. చంద్రబాబునాయుడి పాలన చేసేది ‘చీమంత’, ప్రచారం ‘కొండంత’ అనే రీతిలో సాగుతోంది. దీనికితోడు జగన్ ‘బూచి’ ఆయన్ను అనుక్షణం వెన్నాడుతూనే వుంటుంది. ఈనేపథ్యంలోనే ఎంతసేపూ ప్రతి వైఫల్యానికి, పొరపాటుకు కారణం పాపాత్ముడు జగనే కారణమంటూ ఊదరగొడుతూ గడుపుకొస్తున్నారు. కాలం మారిపోతోంది ఇటువంటి ‘ఓల్డ్ ఫాక్స్’ రాజకీయాలకు కాలం చెల్లిందన్న సత్యాన్ని గుర్తించడానికి చంద్రబాబుకు బహుశా వయసు అడ్డంకిగా మారివుండవచ్చు. లోకేష్ ఛరిష్మా రాష్ట్రస్థాయికి ఎదగలేదు. కానీ అవకాశం వస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి సిద్ధమే. ఇక్కడే పవన్‌కు, లోకేష్‌కు చాలా తేడా వుంది. పవన్ అనుభవం కావాలనుకుంటే, లోకేష్ అధికారం చేజిక్కించుకోవాలనుకుంటారు.ఇక చంద్రబాబు పదవిని వదలద్దనుకుంటారు. ఎవరు వెంటవున్నా లేకున్నా ఒంటరిగా ధైర్యం గా ముందుకెళ్లి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్నది జగన్ అభిమతం. ప్రస్తుతం ఏపీలో ప్రధానంగా వున్న ఈ నలుగురు నాయకుల్లో ఎవరిని ఎప్పుడు అందలమెక్కించాలన్నది రాష్ట్ర ప్రజలచేతుల్లో వుంది.
పడిలేచిన కెరటం
మిగిలిన వారి విషయం ఎలా వున్నా, పవన్ కళ్యాణ్ మాత్రం పడిలేచిన కెరటమని చెప్పాలి. మొదట్లో వామపక్ష భావజాలాన్ని భుజాన వేసుకొని, చేగువేరాను పొగుడుతూ ముందుకెళ్లినా ఫలితందక్కలేదు. కాలానికనుగుణంగా మారని కమ్యూనిస్టు సిద్ధాంతాలు బూజుపట్టిపోయాన్న సంగతి అర్థమై కాడి కిందపడేయాల్సివచ్చింది. బలమైన కమ్మలు, రెడ్లతో పోటీపడాలంటే కులంకార్డు తప్పదన్న సంగతి అర్థమై పై రెండు కులాలకు అనుకూలంగా చీలిన కాపులను ఒక్కతాటిమీదికి తె చ్చేందుకు తంటాలుపడాల్సి వచ్చింది. ఇందుకు వారిలో తనపట్ల విశ్వసనీయతను పాదుగొల్పా ల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఇదే సమయంలో జాతీయస్థాయిలో బలమైన వేరు మాదిరిగా, రాష్ట్రంలో సన్నని వెంట్రుక లాగా బలహీనంగా ఉన్న భారతీయ జనతాపార్టీతో పొత్తుపెట్టుకొని ముందు కెళ్లారు. రాష్ట్రంలో సరైన నాయకత్వం లేక ఇబ్బంది పడుతున్న బీజేపీకి, ఛరిష్మా వున్న నాయ కుడిగా పవన్ కళ్యాణ్ అండ దొరికింది. జాతీయస్థాయిలో తిరుగులేని నాయకత్వం భాజపా సొంతం. ఈ నేపథ్యంలో భాజపా పెద్దలు పవన్‌కళ్యాణ్‌ను చేరదీసి సరైన శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో కమ్మలు, రెడ్లను ఎదుర్కొనే బలమైన కాపు నేతగా తీర్చిదిద్దే పనిలోపడ్డారు. ఈ నేపథ్యంలోనే జగన్ అనే దిగ్గజాన్ని పడగొట్టడానికి తెలుగుదేశంతో చేతులు కలపడమే ఉత్తమమని భాజపా పెద్దలను ఒప్పించిమరీ కూటమిగా పోటీచేసి పవన్ అధికారాన్ని కైవసం చేసుకోగలిగారు. ఈ పరిణామక్రమాన్ని పరిశీలిస్తే పవన్‌లోని నాయకత్వ పటిమ క్రమక్రమంగా పెరుగుతూ పరిణిత స్థా యికి చేరుకుంటోందనేది స్పష్టమవుతోంది. ఇప్పటికీ భాజపా జాతీయ నాయకత్వం చంద్రబాబును విశ్వసించదు. కేవలం పవన్ కారణంగానే భాజపా`తెలుగుదేశానికి మద్దతిస్తోంది.
ఆవేశరానిజాయతీ ఆయుధాలు
అధికారంలో లేనప్పుడు ఆవేశాన్ని, అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాయతీని ప్రదర్శిస్తూ పవన్‌తన ప్రత్యేకతను చాటుకున్నారనే చెప్పాలి. పదవిని నిలుపుకోవడానికి లేదా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఇంకా పాత చింతకాయపచ్చడి వంటి డొంకతిరుగుడు రాజకీయాలను నడుపుతుంటే, పవన్‌కళ్యాణ్ మాత్రం తన ముక్కుసూటి తనంతో అధికశాతం ప్రజల మన్ననలను పొందుతున్నారు. తాను పనిచేసేవాడిగా నిరూపించుకోవడానికి పడుతున్న తపన పవన్ కళ్యాణ్‌లో కనిపిస్తోంది. ఛరిష్మాతో పాటు తనకున్న ఈ నిజాయతీ ఇమేజ్‌ను కాపాడుకుంటూ ముందుకెళితే పవన్‌కు మంచి రాజకీయ భవిష్యత్తు వుంటుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
అన్నదమ్ముల మధ్య తేడా
మెగాస్టార్ చిరంజీవికి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కంటే ఎన్నో రెట్లు అధిక ఛరిష్మా ఉన్నప్పటికీ రాజకీయాల్లో రాణించలేకపోవడానికి ప్రధాన కారణం, దూకుడు లేకపోవడం, విమర్శలపరంగావేగంగా శక్తివంతంగా ఎదురుదాడులకు దిగే మనస్తత్వం కాకపోవడం. ఈ రెండూ పవన్‌లో పుష్కలంగా వున్నాయి. అందువల్లనే ఆయన పవర్ స్టార్! తొలినాళ్లలో తప్పటడుగులు వేసినా, త ర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ విజయపథంలో దూసుకెళ్లగలిగారు. 2014లో జనసేన పార్టీని సాధించిన తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసి పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి చివరకు 2024లో అధికారాన్ని కైవసం చేసుకోగలిగారు. ప్రస్తుతం ఆయన పార్టీకి 21మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. సనాతనధర్మానికి మద్దతు గా రాజకీయ గమనాన్ని సాగిస్తున్న పవన్‌కళ్యాణ్, హిందువుల సుసంఫీుకరణకు సమర్థవంతమైన నాయకుడిగా రూ పొందుతున్నారు.
చంద్రబాబు పాత్ర
ఒకరంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్‌ను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు పాత్ర కూడా లేకపోలేదు. జగన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ చంద్రబాబు పేర్కొనడం, జగన్‌కు నష్టం మాట అట్లావుంచి పవన్‌కు గొప్ప వరం గా మారింది. తిరుమల పవిత్రతను కాపాడాలంటూ సనాతనధర్మ పరిరక్షకుడిగా పవన్ చేపట్టిన దీక్ష, తెలుగురాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని సనాతనధర్మ సమర్థకులకు ఎంతో ఉత్సాహా న్నిచ్చింది. కులరాజకీయాల కుంపట్లో కునారిల్లుకుపోతున్న సనాతనధర్మం, హిందువుల ఐక్యత ను తిరుగులేని స్థాయిలో బలోపేతం చేయగల నాయకుడిగా పవన్ కళ్యాణ్ తనను తాను నిరూ పించుకున్నారు. ‘ఓల్డ్ ఫాక్స్’ రాజకీయాలు నడిపే చంద్రబాబుకు ఇది ముల్లులా గుచ్చుకున్నా అధికారంకోసం భరించక తప్పని పరిస్థితి. నానా ఇబ్బందులను ఎదుర్కొని ఎట్లాగో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన చంద్రబాబు, గతంలో ఇతర రాజకీయ నాయకులతో వ్యవహరించిన రీతిగా ‘కరివేపాకు’ మాదిరిగా ఉపయోగించుకునే పరిస్థితిలేదు. అటువంటి రాజకీయాలు చేస్తే అసలుకే ఎసరొస్తుందన్న సంగతి బాబుకు తెలియంది కాదు. కాలం ఒక్కరీతిగా ఉండదు. పవన్ కళ్యాణ్ ఏపీరాజకీయాలను ‘కులం’ చట్రం నుంచి ‘సనాతనధర్మం’ అనే విస్తృత స్థాయికి తీసుకొని పోగలిగితేరాష్ట్ర భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారగలదు.