Vamshi’s Big Test with Salman Khan
కాపీ కొడతావా? కొత్తగా తీస్తావా?
వంశీ ముందు భాయ్ సవాల్!
బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సల్మాన్ ఖాన్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు డేంజర్లో ఉంది. ఒకప్పుడు ఈయన సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర జాతర జరిగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2016లో వచ్చిన ‘సుల్తాన్’ తర్వాత ఆయనకు ఆ స్థాయి విజయం దక్కలేదు. ‘టైగర్ జిందా హై’ మాత్రమే ఒక మాదిరిగా ఆడింది. గతంలో సల్మాన్ సినిమా ఎలా ఉన్నప్పటికీ భారీ ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు సల్మాన్ సినిమా అంటే ఆడియన్స్ లైట్ తీసుకుంటున్నారు.
ఆయన అభిమానులు కూడా పెద్దగా ఎగ్జైట్ కాని పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న ‘మాతృభూమి’ డిజాస్టర్ కాబోతోందని ముందే ఒక అంచనాకు వచ్చేశారంటే సిచువేషన్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా ఇద్దరూ ఖాన్స్ లో షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ పరిస్థితి కూడా మధ్యలో గొప్పగా ఏం లేదు. కానీ.. వాళ్లిద్దరూ పుంజుకున్నారు. ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలు షారుఖ్‌కు లైఫ్ ఇస్తే.. ‘సితారే జమీన్ పర్’తో ఆమిర్ ఉపశమనం పొందాడు.
కానీ సల్మాన్ పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది. ఇలాంటి టైంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. భాయ్‌తో జట్టు కట్టాడు. వంశీకి దర్శకుడిగా తొలి ఛాన్స్ ఇచ్చాక వరుసగా అతడితో సినిమాలు తీస్తున్న దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రస్తుతం సల్మాన్ ఫ్యాన్స్ ఆశలన్నీ వంశీ మీదే ఉన్నాయి. భాయ్‌కి హిట్ ఇస్తే గనక అభిమానులు అతడికి గుడి కట్టేస్తారనడంలో సందేహం లేదు.
వంశీ పైడిపల్లి స్టైలిష్ టేకింగ్‌కు పెట్టింది పేరు.. కానీ ఆయన ‘రొటీన్’ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనేది ట్రేడ్ టాక్. ఫ్రెంచ్ మూవీ ‘ది ఇంటచబుల్స్’ను ‘ఊపిరి’గా మార్చినప్పుడు ఉన్న కొత్తదనం.. వంశీ సొంత సినిమాల్లో కనిపించదనే విమర్శ ఉంది. ఆయన తీసిన ‘మహర్షి’ అయినా, విజయ్‌తో తీసిన వారసుడు అయినా.. వేరే పాత సినిమాల ఇన్స్పిరేషన్తో నడిచినవే.
ప్రస్తుతం హిందీ ఆడియన్స్ మూడ్ మారింది. వారు రొటీన్ ఫ్యామిలీ డ్రామాలను, పాతకాలపు మాస్ మసాలాలను రిజెక్ట్ చేస్తున్నారు. సల్మాన్ కూడా ప్రేక్షకులను గ్రాంటెడ్‌గా తీసుకుని రొటీన్ సినిమాలు చేయడం వల్లే ఈ పతనం చూశాడు. ఇప్పుడు వంశీ పైడిపల్లి కూడా తన పాత ‘వారసుడు’ ఫార్ములానే సల్మాన్ మీద ప్రయోగిస్తే.. ఫలితం ఊహించడం కష్టం కాదు.
వంశీ పైడిపల్లి రూట్ మార్చి, కొత్తగా ఏదైనా ట్రై చేస్తే తప్ప బాక్సాఫీస్ గెలవడం అసాధ్యం. భాయ్‌కి హిట్ ఇస్తే వంశీకి గుడి కట్టేస్తారు.. లేదంటే ‘భాయ్’ పతనాన్ని వంశీ వేగవంతం చేసినవాడు అవుతాడు. మరి వంశీ మ్యాజిక్ చేస్తాడా? భాయ్‌ని గట్టెక్కిస్తాడా? వేచి చూడాలి.
