వితరణశీలి వద్దిరాజు

దానగుణంలో రంతిదేవుడు….

గుడి కట్టాలన్నా వద్దిరాజు ను గుర్తుచేసుకుంటారు…

బడి కావాలన్నా వద్దిరాజు వద్దకు పోతారు…

స్నేహంలో ఆయనకు సాటి ఎవరూ రారు…

హితులకు ఆయన ఆయన మేలు మాటలకందనిది….

రెండు జిల్లాలో ఆయన రాజకీయబలం….

బిసిలకు మరో బలమైన నాయకత్వం…

సత్యం, సుహృద్భావం, సమ్మతం, నిర్మలం, దరహాసం మనిషికి ఆభరణాలు. వ్యక్తి జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని నింపడమే కాదు, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేవి. అవి నిండుగా, మెండుగా వుండేవారు జీవితంలో ఎదురులేని, తిరుగులేని శక్తియుక్తులు సాధించి, ఉతన్న స్ధాయికి చేరుకుంటారని పెద్దలు

చెబుతుంటారు. పట్టుదల, పరిశ్రమ, కార్యదీక్ష, ఎంచుకున్న లక్ష్యం స్ధిరమైంది,నిత్యమైందైతే గమ్యం చేరడం సులువంటారు. అలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి మార్గం ఎంచుకొని విజయాలలో ఉన్నత శిఖరాలు అందుకొని, తెలుగు రాష్ట్రాలలో అందరికీ తెలిసి, గుర్తుపట్టగలిగే నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. ఆయన ఒక గొప్ప వ్యాపార వేత్త. కాని అందరికీ ఒక తెలంగాణ ఉద్యమ కారుడిగానే చాలా వరకు పరిచయం. వితరణశీలిగా మరింత మందికి తెలిసిన దయామయ గుణం. సంపాదనా పరులు ఎంతో మంది వుండొచ్చు. కాని వితరణశీలురు బహు అరుదు. అడిగిన వారికి లేదనడు. ఇంటికొచ్చిన వారికి కాదనడు. దేవాలయాల నిర్మాణం అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించడు. బడుల నిర్మాణం అంటే సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటాడు. పేదలకు అండగా వుంటాడు. వారిని ఆదుకుంటాడు. తాను సంపాదించిన దానిలో పేదల కోసమే ఎక్కువ ఖర్చు చేస్తుంటాడు. పది మందిలో అందరూ సమాన గౌరవంతో బతకాలని కోరుకునే సామాజిక వేత్త ఆయనలో దాగివున్నారు. అందుకు ఏదైనా గొప్ప కార్యక్రమం చేయాలన్నా, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టాలన్నా తెలుగు రాష్ట్రాలలో ముందు గుర్తొచ్చేవారిలో వద్దిరాజు ఒకరు. అదే ఆయనకున్న గొప్ప గుణం. అందుకే ఆయన అందరికీ సుపచితం. 

వద్దిరాజు రవిచంద్ర…అనే పేరు తెలియని తెలంగాణ వాది లేదు. నాయకుడు లేడు. పార్టీ లేదు. వ్యాపార సామ్రాజ్యంలో రారాజు…వ్యక్తిగత జీవితంలో మహారాజు. వితరణలో కర్ణుడంతటి పేరు సంపాదించుకున్నాడు. పుట్టిన ఊరు,తాగే నీరు, పీల్చే గాలి కూడా జీవితాలపై ప్రభావం చూపుతుందని చెప్పడానికి మన కళ్ల మందు చాలా మంది కనిపిస్తుంటారు. అలాంటి గొప్ప ఆలోచనలు, మనస్తత్వం కలబోసిన వ్యక్తే వద్దిరాజు. ఎందుకంటే కుటుంబ నేఫధ్యం ఎంత గొప్పదో, ఆయన పుట్టిన ఊరు కూడా అంత ప్రత్యేకమైంది. కాకతీయలు మొదట పాలించిన నేల. అరి గజకేసరి అనే బిరుదుతో ప్రసిద్ధిగాంచిన కాకతీయ మొదటి ప్రోలరాజు నిర్మాణం చేసిన గ్రామం కేసముద్రం. గణపతి దేవుడు సోదరి మైలాంబ, తన తల్లి బయ్యాంబ పేరు మీద నిర్మాణం చేసిన బయ్యారం దరిదాపు ప్రాంతం. ఇవన్నీ వున్న మహాబూబాద్‌ జిల్లా అంటే ఒకప్పుడు కవులకు కాణాచి. సాహితీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. తొలి తెలుగు పత్రిక తెనుగు ఆవిష్కరణ జరిగిన ఇనుగుర్తి గ్రామం రవిచంద్ర స్వస్ధలం. ఆ జిల్లా తొలి తరం స్వతంత్ర కాకతీయ రాజరిక పాలనకు నెలవు. అలాంటి ప్రాంతంలో పుట్టి పెరిగిన వారిలో దేశాన్ని ఏలిన మాజీ ప్రధాని పివి కూడా వున్నారు. ఆ ప్రాంతంలో వ్యాపార సామాజ్య్రంలో నెంబర్‌ వన్‌గా పేరు గాంచిన వద్దిరాజు రవిచంద్ర వున్నారు.  

వద్దిరాజు రవిచంద్రది వ్యవసాయ కుటంబం. వ్యాపారాలు ఆదినుంచి నెరుపుతున్న కుటుంబం. కిరాణ వ్యాపారం నుంచి 1972లో రైస్‌ మిల్లు వ్యాపారం, ఆ తర్వాత అంచెలంచెలుగా గ్రానైట్‌ వ్యాపారం ఇలా ఒక్కొ మెట్టు ఎదుగుతూ వచ్చారు. తిరుగులేనిశక్తిగా ఎదిగారు. బ్లాక్‌ గ్రానైట్‌ వ్యాపారంలో నెంబర్‌ వన్‌ స్ధానంలో కొనసాగుతున్నారు. పెద్దగా పైకి ఆయన ప్రజల్లో కనిపించినట్లు అనిపించకపోయినా ప్రజలంటే ఆయనకు ఎంతో ఇష్టం. పేదలకు సాయం చేయడమంటే కూడా ఎంతో సంతోషం. వారి కళ్లలో ఆనందం చూడాలని కోరుకుంటారు. అందుకే ఆయన సన్నిహితులు, హితులు,మిత్రులు, బంధువులు, ఆఖరుకు తన వద్ద విధుల్లో వుండే చిన్నా, పెద్ద ఉద్యోగులను కూడా ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటారని అంటుంటారు. అందుకే ఆయనంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. పార్టీలకు అతీతంగా ఆయనను అభిమానిస్తుంటారు. అదే తెరాసకు దగ్గర చేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముఖ్య అనుచర గణంలో ఒకడిని చేసింది. ఆయనకు దగ్గర చేసింది. ఆత్మీయుడిగా మార్చింది. ఎంతో మంది సీనియర్లు వున్నప్పటికీ వద్దిరాజు రవిచంద్ర గొప్పదనం, వ్యక్తిత్వం మూలంగానే ఆయనకు రాజ్యసభ సీటు వరించింది. నిజానికి వద్దిరాజు తెరాసలో చేరి కొంత కాలమే అవుతుంది. కాని ఆయన ఏనాడు పదవుల కోసం ఆలోచించలేదు. ఆశించలేదు. పార్టీకోసం చేయాల్సినంత సేవ చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నారు. 

నాయకులకు అండగా వుంటున్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అటు ఖమ్మం, ఇటు వరంగల్‌ రెండు జిల్లాల్లో ఆయన నాయకులను, కార్యకర్తలను ఆదరించడం అన్నది ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కదిలించింది. మెప్పించింది. పార్టీపై వద్దిరాజుకు వున్న అభిమానం గురించి తెలిసేలా చేసింది. అందుకే వద్దిరాజను రాజ్యసభ వరించింది. ఇదిలా వుంటే పార్టీ పరంగా ఆయనకు జాతీయ స్ధాయిలో వున్న పరిచయాలు, సంబంధాలు కూడా ఇప్పుడున్న పరిస్ధితుల్లో తెరాసకు ఎంతో అవసరం కూడా. ముఖ్యమంత్రి కేసిఆర్‌ జాతీయ స్ధాయి రాజకీయాల్లో క్రియాశీలం కానున్నారు. వద్దిరాజు రవిచంద్రకు ఆది నుంచి జాతీయ స్ధాయి నాయకులతో పెద్దఎత్తున పరిచయాలున్నాయి. వద్దిరాజు వ్యాపారాలు దేశంలో అనేక రాష్ట్రాలలో వున్నాయి. దాంతో ఆయనకు విసృతమైన పరిచయాలు కూడా వున్నాయి. కాకపోతే ఆయన ఎక్కడా వాటిని ప్రచారం చేసుకున్న సందర్భం లేదు. లోప్రొఫైల్‌ మెంటైన్‌ చేయడమే ఆయనకు ఆది నుంచి అలవాటు. కాని ఆయన గురించి తెలిసిన వారికి మాత్రమే వద్దిరాజు జీవన ప్రయాణం తెలుసు.

గత ఎన్నికల్లో ఆయన వరంగల్‌ తూర్పు నుంచి పోటీ చేశారు. ఎన్నికలకు కేవలం పదిహేను రోజుల ముందు టిక్కెట్టు తెచ్చుకున్నా, నియోజకవర్గంలో రెండో స్ధానంలో నిలిచారు. అంటే ఆయనకు ప్రజల్లో వున్న అభిమానం ఎంతటిదో ఈ ఒక్క లెక్క చాలు. అటు నాయకుడిగా ప్రజలకు చేరువగా, దాతగా వితరణశీలిగా సామాన్య జనం గుండెల్లో వుంటూ, వ్యాపారవేత్తగా దేశ వ్యాప్తంగా పరిచయాలున్నాయి. దాంతో గత ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ సూచనల మేరకు టిఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటినుంచి ఆయన పార్టీకి తన సేవ చేస్తూ వస్తున్నారు. కాని ఏనాడు తనకు పదవులు కావాలని కోరలేదు. అర్హత వున్న నాయకుడికి పదవులు వచ్చి ఒళ్లో వాలుతాయి. అదే నిజమైంది. వద్దిరాజు లాంటి బలమైన బిసి నేతకు పదవి రావడం అంటే బిసి సామాజిక వర్గానికి ఒక ధైర్యమనే చెప్పాలి. ఆయన ఇప్పటికే కాపు రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడుగా వున్నారు. రాష్ట్ర గ్రానైట్‌ అసోసియేషన్‌కు ప్రెసిడెంటుగా కొనసాగుతున్నారు. పైగా కరీంనగర్‌కు చెందిన మంత్రి గంగులకమలాకర్‌ సోదరుడికి వద్దిరాజు వియ్యంకుడు. ఆయన వ్యాపారవేత్తగా ఆయనేంటో ఖమ్మం ప్రజలకు తెలుసు. సినిమాల్లో చెప్పినట్లు ఇంట్లో జరిగే పెళ్లి పది తరాలు చెప్పుకునేలా వుండాలన్నది ఎవరైనా కలే కల. కాని ఆ కల అందరికీ తీరదు. కాని వద్దిరాజు తన కుమారుడి పెళ్లి అంగరంగవైభవంగా చేయడం ఖమ్మం ఇంకో పదేళ్లు చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. సంతోషాన్ని కూడా అందరితో పంచుకునే సహృదయుడు. అలాంటి నేతకు రాజ్యసభ సభ్యుడు కావడం ఆయన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతో సంతోషిస్తున్నారు. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, రాజకీయంగా ఆయన మరిన్ని పదవులు అదిష్టించాలని నేటిధాత్రి కోరుకుంటోంది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *