మీకు సోయుంటే ‘పీకే’ఎందుకు?

కరంటు గోసలు యాదున్నాయా?
`పూటలో ఎన్ని గంటలు పోయేదో అయినా యాదొస్తుందా?
`సకల జనుల సమ్మెకాలంలో ఎంత నరకం చూపించారో గుర్తుందా?
` పంటలు ఎండిన కాలం మర్చిపోయారా?
`ఏన్నేండ్లు బావులు ఎండిపోయాయో! యాదొచ్చెనా?
`2015లో ఎండాకాలంలో ఊటలొచ్చి, బావులు నిండి గంతులేయలేదా?
` బోర్లు ఎళ్లవోసుడు చూసినామా లేదా!
`కరంటు కష్టాలు మర్చిపోవద్దు…
`సర్‌చార్జీలు, సర్వీసు చార్జీల వాతలు ఎలా మర్చిపోతాం?
`పల్లెల్లో కరంటు చూడని రోజులెన్నో గుర్తు చేసుకోండి?
`పట్టపగలే కరంటు వెలుగులు ఎందుకున్నాయో తెలుసుకోండి!

పచ్చగున్న కాడ పండంగానే కాదు. ఎండినప్పటి సంగతి గూడ యాది చేసుకోవాలే. ఎండిన దినాలు మర్చిపోతే నష్టం. పచ్చదనం గప్పట్ల గిట్లలేకనే కొట్లాడగినం అని ఇప్పట్లోకు చెప్పాలే! గతమెప్పుడూ మర్చిపోవద్దు. గతాన్ని తల్చుకుంటూ వర్తమానం ఆగిపోవద్దు. అందుకే కేసిఆర్‌ తెలంగాణ కోసం కొట్లాడిరడు. ఏళ్ల తరబడి సాగిన కరంటు గోస తెలంగాణ తెచ్చి మూన్నెళ్లలో తీర్చండు. గప్పటి కష్టం యాది రాకున్నా పాయే, గాని గప్పట్ల నష్టం మర్చితే తిన్నింటి వాసాలు లెక్కవెట్టినట్లే…..తెలంగాణ ప్రజల తండ్లాట యాదిలేనట్లే…


తెలంగాణ వస్తే ఏమొస్తది? అన్నవారు ఎక్కడా కనిపించకుండాపోయారు. తెలంగాణ వచ్చాక ఏమొచ్చింది? అని రాజకీయ నిరుద్యోగులైన వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడాయని కొట్లాడిరది ప్రజలు. తెలంగాణ తెచ్చుకొని సల్లంగ బతుకుతున్నది ప్రజలు. కాని నిద్రలేని రాత్రులు గడుపుతున్నది ప్రతిపక్షాలు. తెలంగాణ వెలుగులు జీర్ణించుకోలేని వాళ్లు. ఇప్పుడన్నా అధికారం మాకు వస్తుందా? అని ఎదరుచూస్తున్నవాళ్లు? ఎంత చెప్పినా ప్రజలు మావైపు చూస్తలేరని, మాకు ఓటు వేస్తలేరని కుళ్లుకుంటున్నవాళ్ల కళ్లముందు నిజాలు…తెలంగాణలో కరంటు వెలుగులు.
సరిగ్గా ఏడేళ్ల క్రితం తెలంగాణలో చిమ్మచీకట్లు…బతకాలంటే కరంటు. బతుకంటేనే కరంటు. అడుగేస్తే కరంటు. ఇదీ ప్రపంచపు ప్రగతి అడుగు. కరంటు లేకుండా ఏదీ లేదు. కరంటు లేకుండా ఏ పని కాదు. అన్నింటికీ సర్వరోగ నివారణి కరంటు. కాని ఆ కరంటే తెలంగాణలో కళ్ల నిండా చూసింది లేదు. రోజులో ఇరవై నాగులు గంటలు ఎన్నడా సరఫరా అయ్యింది లేదు. పగలు కరంటు చూసిన దాఖలాలు లేవు. పల్లెల్లో రాత్రిళ్లు ఎప్పుడొచ్చిపోయేదో కూడా తెలియని కరంటు. ఎండా కాలం వచ్చిందంటే నరకం. అది మాటల్లో చెప్పలేనంత వర్ణణాతీతం. అటు దోమలు. ఇటు ఉక్కపోతలు. కరంటు లేక పగలు పని లేని దినాలు. రాత్రిళ్లు నిద్రలు లేని రోజులు. ఒక్క మాటలో చెప్పాలంటే నరకం ప్రత్యక్షంగా పాలకులు చూపించిన దశాబ్దాల కాలం. కర్రపట్టుకొని తెలంగాణ వస్తే మొత్తం తెలంగాణ వస్తే చీకటే అని లెక్కలేసి భయ పెట్టారు. ఇప్పుడున్న కరంటు కూడా కళ్ల చూడరన్నారు. కాని పని చేసుకోవాలన్నా కరంటు కావాలి. చిన్నా చితక వ్యాపారమైనా కరంటు కావాలి. ఆఖరుకు జిరాక్స్‌ మిషన్‌ నడవాలన్నా కరంటు కావాలి. నిర్మాణ రంగం సాగాలంటే కరంటు కావాలి. పంటలకు కరంటు కావాలి.
దశాబ్ధం క్రితం వరకు మనది చీకటి బతుకుల తెలంగాణ. చీకట్లు కమ్ముకున్న తెలంగాణ. వెలుగు లేని తెలంగాణ. వేకువ కరువైన తెలంగాణ. కళ్ల నిండా కాంతి చూడని తెలంగాణ. కంటి ముందు కన్నీళ్ల తెలంగాణ. కరంటు లేని తెలంగాణ. ఇంటింటికీ కరంటు సరఫరా పూర్తిగా లేని తెలంగాణ. దళిత వాడాల్లో గుడ్డి దీపాల తెలంగాణ. కరంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని తెలంగాణ. సాగుకు కూడా మీటర్లు పెట్టి కరంటు అమ్మిన తెలంగాణ. హార్స్‌పవర్‌కు రూ.50 అంటూ జాలితో కూడా దోచుకోబడ్డ తెలంగాణ. ఆఖరు అది కూడా ఎత్తేసి మొత్తానికి మొత్తం విద్యుత్‌ చార్జీల మోత తెలంగాణ. ఇదీ తెలంగాణ రైతు కష్టం. ఇదీ తెలంగాణ రైతు ఎదుర్కొన్న నష్టం. విత్తునాడు సక్కగ రాని కరంటు. నారులోనే ఎండిన పైరు. నీళ్లు చాలక ఎండిన పొలం. అర్ధరాత్రిలు బావుల దగ్గర నిద్రల తెలంగాణ. పాము కాట్లకు రైతులు బలైన తెలంగాణ. దగా పడ్డ తెలంగాణ. గోసపడ్డ తెలంగాణ. అరిగోస ఎదుర్కొన్న తెలంగాణ. తినడానికి తిండిలేని తెలంగాణ. పంటలు కూడా కళ్లారా చూసుకోలేని తెలంగాణ. భూములన్నీ పడావు బడ్డ తెలంగాణ. బీడులన్నీ నోళ్లు తెరిచిన తెలంగాణ. ఇవన్నీంటికీ సర్వ రోగ నివారిణి కరంటు జాడ లేని తెలంగాణ. ఇది చూడని వాళ్లున్నారా? ఇది తెలియని వాళ్లున్నారా? ఇది అనుభవించని వాళ్లున్నారా? ఇది మళ్లీ మళ్లీ గుర్తు చేస్తే గాని తెలుసుకోలేరా? ప్రజలకు తెలియదా? నాయకులకు తెలియదా? మరి ఇప్పుడు అలాగే వుందా? నాటి రోజుల కలలోనై కనిపిస్తున్నాయా? నాడు సక్కగ రాని కరంటుకు సర్‌చార్జీలు. సర్వీసు చార్జీలు. సెస్స్‌ చార్జీలు. పన్నుల మోతలు. వసూళ్లు వాతలు. రెండు నెలలకోసారి వచ్చే కరంటు బిల్లులు నెల నెల మొదలు పెట్టిన వసూళ్లు. జనం జేబులకు చిల్లులు. అయినా తప్పని కోతలు…తిప్పలు. పనులు లేక అప్పులు. కరంటు సరిగ్గా రాక పస్తులు.
తెలంగాణ ఎప్పుడు పచ్చబడిరది? ఎందుకు పచ్చబడిరది? అరవై ఏళ్లలో లేని వెలుగు తెలంగాణ రాగానే మూడు నెలల్లోనే ఎందుకొచ్చింది? ఇది ఎవరికీ అవసరం లేదా? ఎండా కాలం ఉక్కపోత…చలికాలం దోమలతో తంటా…వానా కాలంలోనూ కరంటు కటకట. ఇవన్నీ భరించిన తెలంగాణ. ఇవన్నీ దిగమింగిన తెలంగాణ. బిల్లులు మాత్రం నెలనెలా చెల్లించిన తెలంగాణ. రోజూ పద్నాలుగు గంటల కరంటు కోతలే. పల్లెల్లో ఇరవై గంటలకు పైగా చీకట్లే… మరి ఇప్పుడు కోత అన్నది లేని తెలంగాణ. వాతలకు దూరమైన తెలంగాణ. వెలుగుల్లో కళకళలాడుతున్న తెలంగాణ. చీకటి లేకుండా వెలుగులు నిండిన తెలంగాణ. సాయంత్రమైందంటే పగటిని తలపించేలా వెలుగుల తెలంగాణ. పట్నాలే కాదు, పల్లెల్లోనూ హైమాస్‌ లైట్ల జిలుగుల తెలంగాణ. ఈ వెలుగులు ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు లేవు? ఈ కరంటు వెలుగులు ఆనాడెందుకు లేవు? ఈ ఆలోచన నాయకులకు రాదా? జనానికి చెప్పాలన్న సోయి లేదా? అరవైఏళ్లలో ఏనాడు కనిపించింది లేదు. తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే నిరంతర కరంటు ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? రావడానికి కారణం ఏమిటి? రావడానికి కారణం ఎవరు? ఇవన్నీ తెలంగాణ సమాజం ఆలోచించడం లేదా? రోజులో నిరంతరం గంట కరంటు వుంటే చాలు. మా బతుకులకు ఇంత మెతుకు దొరకుతుందని మధనపడిన రోజులు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లోని పరిశ్రమలకు వారంలో మూడు రోజులు సెలవులు. అటు క్రాప్‌ హలిడే. ఇలా కరంటు లేక సాగు కూడా లేకుండాపోయిన రోజుల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన తెలంగాణ. ఆ రోజులు గుర్తుకొస్తే ఇంకా గుబులు కళ్లలో కనిపిస్తుంది. కాని నేడు ఆ చీకటి లేదు. కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌.
ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు అనే పదం వినబడితే చాలు ఎండినపోయిన వరి కట్టలు పట్టుకొని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్రులగా వచ్చేవారు. కందిర్లు పట్టుకొని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకోవడం ప్రతి సమావేశాల్లో చూశాం. కాని ఆ పరిస్ధితులు నేడు తెలంగాణలోనే లేదు. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోచీకట్లు. పాలకుల సవతితల్లి ప్రేమతో ఇక్కట్లు. కాని అదే మరో ప్రాంతంలో కరంటు వెలుగులు. పంటలు. వారి జీవితాల్లో సంతోషాలు. నేడు తెలంగాణలో ఎక్కడా లేనంతగా కరంటు సరఫరాలు. అదే మరో తెలుగు రాష్ట్రంలో కరంటు కోతలు. మన దగ్గర కోత అన్న పదమేలేదు. ఒక్క విద్యుత్‌ వెయ్యి సమస్యలకు మార్గాలు. ఇంటింటికీ వెలుగు. పరిశ్రమలకు పనులు. కరంటుతోనే అన్ని పనులు.
మిడిమిడి జ్ఞానం మిద్య. అదే కొందరి రాజకీయ భవిష్యత్తుకు ప్రశ్నగా మారింది. కొట్లాడినంత కాలం కొట్లాడినం. పద్నాలుగేళ్లు తెలంగాణ పోరాటం జేసినం. తెలంగాణ తెచ్చుకున్నం. కాలం కలిసొచ్చి ఎమ్మెల్యేలైనం. ఇక అన్నీ మన ముఖ్యమంత్రి కేసిఆర్‌ చూసుకుంటడు. ఇక మాకేం పని…అని ఎవరికివారు తమతమ వ్యాపకాల్లో పడొద్దు. ఇదే ముందు నుంచి ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెబుతున్నది. మనమేం చేయకపోయినా ఫరవాలేదు. తిట్టినా, పెట్టినా మన సారే…కోపమొస్తే ఓ మాటంటడు. కష్టమొస్తే కడుపుల వెట్టుకుంటడు. అని అనుకుంటున్నారే గాని పార్టీకి తిప్పలు రాకుండా జాగ్రత్తగా వుండాలన్న సోయి కొందరు మర్చిపోయిండ్రు. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమౌతోంది. తెలంగాణ గోస అంటే ఏంటో తెలియని పికే సేవలు కూడా అవసరమౌతోంది. ఇప్పటికైనా నాయకులు మేలు కుంటే ఏ పీకే అవసరం లేదు. ఎవరో పీకేసేంత పెద్ద పెద్ద సమస్యలేం ఇక్కడ లేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *