జనగామ జననేత పోచంపల్లి

`ఈసారి పోచంపల్లికే టికెట్‌?

` గతం నుంచి నేటిధాత్రి చెబుతున్నదే!

`జనగామ బిఆర్‌ఎస్‌ లో జనాదరణ పోచంపల్లి కే.

`తక్కువ సమయంలోనే పార్టీ శ్రేణుల మనసు చూరగొన్న పోచంపల్లి.

`మళ్ళీ ముత్తిరెడ్డి అంటే మునుగుడే?

`పార్టీ నాయకుల మదిలో మాటే?

`ఈసారి ముత్తిరెడ్డి ని మార్చకపోతే నష్టమే!

`సమస్యల పరిష్కారంలో ముత్తిరెడ్డి నిర్లక్ష్యం.

`గతంలో వున్న ముత్తిరెడ్డి రెడ్డి హడావుడి ఇప్పుడు లేదు.

`ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా అంత శ్రద్ధ పెట్టడం లేదు?

`పార్టీ పటిష్ఠం కోసం పెద్దగా దృష్టి పెట్టడం లేదు?

`ముత్తిరెడ్డి కి ఇప్పటికే అందిన సంకేతాలు?

` జనగామలో బిజేపి పెరగడానికి సైతం ముత్తిరెడ్డే కారణమంటున్న బిఆర్‌ఎస్‌ శ్రేణులు.

`ముత్తిరెడ్డి వ్యవహార శైలిలో నష్టపోయిన ఎంతో మంది ఉద్యమకారులు.

` అధికారుల మనస్తాపం, ప్రజల కోపం, ముత్తిరెడ్డి జనగామ సీటు గండం?

` జనగామకు మెడికల్‌ కాలేజీ మంజూరులో పోచంపల్లిదే కీలక పాత్ర!

` పోచంపల్లి జనానికి దగ్గర!

`ముత్తిరెడ్డి వివాదాలకు చేరువ?

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

జనగామలో మళ్లీ మొదలైన చర్చ…నిజంగా ఇది పెద్ద రచ్చే.. వచ్చే ఎన్నికల్లో జనగామకు బిఆర్‌ఎస్‌ కొత్త నాయకత్వం కావాలి. లేకుంటే పార్టీ పరిస్ధితి ఆగమ్య గోచరమౌతుంది? అన్నది సర్వత్రా వినిపిస్తోంది. కాలాలు మారుతుంటాయి. తరాలు అంతరిస్తుంటాయి. అలాగే కాలానుగుణంగా నాయకత్వాలు కూడా మారుతుంటాయి. కొత్త నాయకత్వాలు అవరమౌతుంటాయి. పాత నీరు పోయి కొత్త నీరొచ్చినట్లు పాత తరం నేతలు పక్కకు వెళ్లాల్సిన సమయం కూడా కొన్ని సార్లు ఆసన్నమౌతుంది. కొత్త తరాన్ని యువతరం కోరుకుంటుంది. ఆ కొత్త నాయకత్వం ప్రజలకు చేరువకావాల్సి వస్తుంది. కొత్త తరం రాజకీయాలు చిగురుతొడినప్పుడే మరింత పటిష్టమైన యువ నాయకత్వం ప్రజలకు చేరువౌతుంది. ఆ యువ నేతలు ప్రజల చేత ఆదరింపబడుతారు. ఆశీర్వాదాలు అందుకుంటారు. ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందుతుంటారు. రాజకీయాల్లో ప్రచారం వేరు. వాస్తవం వేరు. ఆదరణ వేరు. ఆధిపత్యం వేరు. నాయకత్వం వేరు. నాయకత్వంలో ఉత్తమ లక్షణాలు వేరు. నాయకత్వం మీద నమ్మకం వేరు. నాయకుడి పని తనం వేరు. ఇవన్నీ ఒకే నాయకుడిలో వుంటే ఆ నాయకుడికి గుర్తింపు వేరే లెవల్‌ అని మాత్రం చెప్పొచ్చు. అలాంటి యువతరం నేతలు తెలంగాణలో చాలా మందే వున్నారు. ముఖ్యంగా బిఆర్‌ఎస్‌లో కొత్త తరం వెలుగులోకి వస్తుంది. నూతన నాయకత్వాలను కూడా నియోజకవర్గాలు కోరుకుంటున్నాయి. అలాంటి నాయకుడిపట్ల ప్రజల్లో అచెంచలమైన విశ్వాసం ఏర్పడితే మరో తరం వరకు చెక్కు చెదరదు. ఆ నాయకుడు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. అలాంటి నాయకుడే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి. భవిష్యత్తు జనగామ జిల్లా నాయకుడిగా ఎదిగేందుకు అవకాశాలు మెండుగా వున్న నాయకుడు. ఇప్పటికే వరంగల్‌ జిల్లా రాజకీయాలతోపాటు, మఖ్యంగా జనగామ జిల్లా రాజకీయాలకు ఎంతో సుపరిచిడైపోయాడు. అందుకే జనగామ కొత్త నాయకుడిగా ఈ తరం, యువతరం ఆయనను నాయకుడిగా కావాలని కోరుతోంది. అందుకు అనేక కారణాలున్నాయి. 

ఈసారి జనగామ నుంచి బిఆర్‌ఎస్‌ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై సర్వత్రా కొంత కాలం వరకు ఉత్కంఠగానే వుండేది.

 కాని ఈ మధ్యే జనగామ రాజకీయాల మీద స్పష్టత వస్తోంది. గతం నుంచి నేటిధాత్రి కూడా ఇదే చెబుతూ వస్తోంది. జనగామ నుంచి ఈసారి ముత్తిరెడ్డికి టికెట్‌ ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు అడ్డుకునేందుకు కూడా సిద్దంగానే వున్నట్లు సమాచారం. ఎందుకంటే గత ఎన్నికల్లోనే ముత్తిరెడ్డికి కాకుండా ఎవరికి ఇచ్చినా మాకు ఓకే అన్నంత తరహాలో చేర్యాల, మద్దూరు మండలాలకు చెందిన నాయకులు అనేక సమావేశాలు ఏర్పాటు చేసి మరీ వ్యతిరేకించారు. పార్టీ అధిష్టానానికి సూచనలు చేశారు. కాకపోతే ఆ సమయంలో వున్న పరిస్ధితులను బట్టి తీసుకున్న నిర్ణయంలో జనగామ నియోజక వర్గ నాయకులకు కూడా అంగీకరించారు. కాకపోతే ఈసారి మాత్రం ఎట్టిపరిస్ధితుల్లోనూ ముత్తిరెడ్డికి ఇస్తే సహించలేమని, సహకరించలేమని తేల్చిచెబుతున్నారు. గతంలో చేర్యాల, మద్దూరు, నర్మెట్ట మండలాలు సరిగ్గా సహకరించలేదన్న కోపమో ఏమో కాని ముత్తిరెడ్డి చేర్యాల మీద పెద్దగా దృష్టిపెట్టలేదన్న ఆరోపణలు మాత్రం వున్నాయి. జిల్లాల విభజన తర్వాత చేర్యాల రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ కోరుతున్నారు. కాని ముత్తిరెడ్డి ఆ విషయం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రికి చెప్పి ఒప్పించినట్లు వార్తలు లేవు. గతంలో కూడా ఇలాగే జనగామ జిల్లా ఏర్పాటు కోసం ఎద్దఎత్తున ఉద్యమం సాగుతుంటే ముత్తిరెడ్డి పెద్దగా సహకరించలేదు. పైగా జనగామలో ఏడాదికాలం పాటు 144 సెక్షన్‌ అమలు చేయించిన ఘనత ముత్తిరెడ్డిది అన్న విమర్శలుండనే వున్నాయి. ఆనాటి నుంచి వున్న చేర్యాల రెవిన్యూ డివిజన్‌ సమస్య అలాగే వుంది. ఇలా జనగామ నియోజకవర్గంలో వున్న సమస్యలను పరిష్కరించడంలో ముత్తిరెడ్డి ఏమాత్రం చొరవ చూపలేదన్నది బిఆర్‌ ఎస్‌ నాయకులే చెప్పుకునే మాట. 

ఇదే సమయంలో గత కొంత కాలంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి జనగామ నియోజకవర్గ ప్రజలకు, బిఆర్‌ఎస్‌ నాయకులకు బాగా చేరువైనట్లు వార్తలు వస్తున్నాయి. 

యువతరానికి బాగా దగ్గరైనట్లు కూడా చెప్పుకుంటున్నారు. పైగా సమస్యల పరిష్కారానికి నేరుగా పోచంపల్లి వద్దకు వెళ్లి చెప్పుకునే పరిస్ధితి వుంది. కాని ఆనాటి నుంచైనా సరే ముత్తిరెడ్డి వద్దకు నేరుగా వెళ్లే పరిస్దితి ఎవరికీ లేదన్నది అందరికీ తెలిసిన ముచ్చటే అంటున్నారు. పైగా ఆయన వద్ద సమస్యల ప్రస్తావన తీసుకొచ్చినా, ఆయన చెప్పిందే వినాలే తప్ప, ప్రజలు చెప్పినా, ఇతర నాయకులు చెప్పినా వినే పరిస్దితి ఎప్పుడూ లేదన్నది బిఆర్‌ఎస్‌ నాయకుల వాదన. ఇదిలా వుంటే ఆది నుంచి నియోజకవర్గంలో ముత్తిరెడ్డి వివాదాలు షరా మామూలే అంటున్నారు. జనగామ కలెక్టర్‌తో గొడవతో మొదలు, జిల్లా వాసులు ముత్తిరెడ్డి వివాదాలు కథలు, కథలుగా చెప్పుకుంటారు. అందుకే ఈసారి పొరపాటను కూడా ముత్తిరెడ్డికి టికెట్‌ ఇవ్వకూడదన్న విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా కొందరు నాయకులు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈసారి ముత్తిరెడ్డికి టిక్కెట్‌ ఇస్తే గెలిచే సీటును ప్రతిపక్షాలకు పువ్వుల్లో పెట్టి ఇచ్చినట్లే అంటున్నారు. జనగామ జిల్లాలో బిఆర్‌ఎస్‌ ఎంతో బలంగా వుంది. జనగామ నియోజక వర్గంలో బిఆర్‌ఎస్‌లో ఇంత వరకు అంతర్గత పోరు లేదు. కాని ఇతర పార్టీలలో చోటా మోటా నాయకుల అంతర్గత పోరుతో సతమతమౌతున్నాయి. అందువల్ల ప్రజలకు ఎట్టిపరిస్ధితుల్లో ప్రతిపక్షాల వైపు చూసే అవకాశం లేదు. కాకపోతే బిఆర్‌ఎస్‌ కూడా అభ్యర్ధిని మార్చితేనే గెలుపు నల్లేరు మీద నడకౌతుందంటున్నారు. కాంగ్రెస్‌పార్టీలో ఆధిపత్య పోరు మూలంగా ఇప్పటికీ ఆ పార్టీలో స్పష్టత లేదు. ఎన్నికల సమయం వరకు స్పష్టత వస్తుందన్న నమ్మకం లేదు. గత ఎన్నికల్లోనే ఆఖరు నిమిషంలో పొన్నాలకు టిక్కెట్‌ ఇచ్చారు. ఈసారి కూడా తనకే కావాలని పొన్నాల కోరుతున్నాడు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, జంగారాఘవరెడ్డిలు పోటీ పడుతున్నారు. అందువల్ల ముత్తిరెడ్డికి బిఆర్‌ఎస్‌ నుంచి ఒకవేళ టిక్కెట్‌ ఇస్తే మాత్రం చేర్యాల, మద్దూరు, నర్మెట్ట, మండలాలు కాంగ్రెస్‌వైపు మళ్లేందుకు అవకాశాలున్నాయి. ఒక వేళ పోచం పల్లికి ఇస్తే బిఆర్‌ఎస్‌ శ్రేణులు పూర్తి స్ధాయిలో పనిచేసి బిఆర్‌ఎస్‌ గెలుపును సునాయాసం చేస్తారు. ఇక జనగామ టౌన్‌ తోపాటు, మండల పరిధి గ్రామాలలో, బచ్చన్నపేట మండలంలో బిజేపి బలపడడానికి కూడా ముత్తిరెడ్డి వ్యవహరించిన తీరే కారణమన్న ఆరోపణలున్నాయి. ముత్తిరెడ్డికి ఈసారి టిక్కెట్‌ ఇస్తే, జనగామ, బచ్చన్నపేట మండలాల పరిధిలో బిజేపికి ఆయుధం అందించినట్లే అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా వుంటే ఈసారి టెక్కెట్‌ తనకు దక్కకపోవచ్చ సంకేతాలు ముత్తిరెడ్డికి ఇప్పటికే అందినట్లు కూడా తెలుస్తోంది. 

అందుకే ఆయన పార్టీపరమైన కార్యక్రమాలలో గాని, ప్రభుత్వ పరమైన విషయాలలో పెద్దగా దృష్టిపెట్టడం లేదని అంటున్నారు. ఇటీవల కాలంలో జనగామలో వీధి కుక్కల బెడద పెద్దఎత్తున పెరిగిపోయిందని, నిత్యం ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని జనగామ సాధన సమితి సభ్యులు ముత్తిరెడ్డి పట్టింపు లేని తనంతోనే మున్సిపల్‌ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు. అంతే కాకుండా జనగామలో పెరిగిపోయిన కోతులను పట్టుకొని అడువుల్లో వదిలేయాని ఎన్ని సార్లు కోరినా, ముత్తిరెడ్డి ఈ విషయంలో పట్టించుకోలేదంటున్నారు. ఇవి చిన్న సమస్యలుగా కనిపించినా ప్రజలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలు. ప్రాణాలకు సంబంధించిన సమస్యలు. వీధికుక్కలు బైట తిరగనివ్వడం లేదు. కోతులు బైటకు రానివ్వడంలేదంటూ ప్రజలు గగ్గొలు పెడుతున్నారు. ఇలా ప్రజా సమస్యల విషయంలో ముత్తిరెడ్డి నిర్లక్ష్యం, నిర్వాకం కనిపించడం కూడా పార్టీ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఏది ఏమైనా పార్టీ బలంగా ప్రాంతాల్లో నాయకత్వ మార్పులో నిర్ణయం తీసుకోకపోతే, ప్రతిపక్షాలు బలపడేందుకు దోహదముందుని అంటున్నారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన నాయకుల్లో కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *