కవిత జీవితమే ఒక ఉద్యమం

తెలంగాణ పోరాటమే ఆమె జీవితం.

కవిత పట్ల ఈడీ అనుసరిస్తున్న వైఖరి మహిళా హక్కులను కాలరాడమే!

బిజేపి అసహనం, దొడ్డి దారి పైత్యం, రాజకీయం కోసం చిల్లర జిత్తులు తెలంగాణలో సాగవంటున్న భూపాలపల్లి జిల్లా ‘‘బిఆర్‌ ఎస్‌’’ పార్టీ అధ్యక్షురాలు, వరంగల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ‘‘గండ్ర జ్యోతి’’, నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’కు వివరించిన ఆసక్తికరమైన విషయాలు.

చట్టాలు చేసే సభ్యురాలికే హక్కులు అందకపోతే…సామాన్యుల పరిస్థితి ఏమిటి?

ఈడీ పరధి దాటడానికి కేంద్ర పెద్దల ఒత్తిడి కారణం కాదా?

మహిళలకు రక్షణ చట్టాలు ఈడీ ముందు బలాదూరా?

ఈడీ చెబుతున్నదేమిటి? చేస్తున్నదేమిటి?

ఈడీ ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడిరదా?

అసలు కవిత విషయంలో మనీ లాండరింగ్‌ ఆపాదించడమే తప్పు?

కవిత నిందితురాలు కాదు…అనుమానితురాలు కూడా కాదు?

బిజేపి పెద్దల కక్ష సాధింపులో కవితను ఇరికించే ప్రయత్నం చేశారు?

మహిళా హక్కుల కోసం పోరాటం చేసే కవితకే రక్షణ కరువౌతోంది?

బిజేపికి మహిళలంటే ఎంత చిన్న చూపో ఇక్కడే తేలిపోయింది.

ఇప్పటికైనా బిజేపి తన వైఖరి మార్చుకోకపోతే పతనమే!

బిజేపి అప్రజాస్వామిక ధోరణి దేశమంతా గమనిస్తోంది?

ఈడీ విచారణలో ఏం జరుగుతుందో బిజేపి ఎంపిలకు ఎలా తెలుస్తోంది?

గోప్యంగా వుండాల్సిన విచారణ ఎలా లీకౌతోంది?

కవిత మీద బండి సంజయ్‌ వ్యాఖ్యలు కేంద్ర మహిళా కమిషన్‌ ఎందుకు స్పందించలేదు?

ఒక్క కవిత మీద అంత దాడి చేస్తున్నారంటేనే బిజేపి ఎంత భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు!

హైదరబాద్‌,నేటిధాత్రి: 

యత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమంతే దేవతా! అన్నారు పెద్దలు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ నిత్యం సుద్దులు వల్లించే బిజేపి పార్టీ పెద్దలు,నేతలకు మహిళలు రాజకీయాల్లో రాణించడం ఇష్టం లేదా? మహిళలు రాజకీయాల్లోకి రావొద్దా? రాణించొద్దా? ప్రజా సమస్యలపై మాట్లాడొద్దా? మిగతా నాయకులకన్నా గొప్పగా ప్రభావం చూపొద్దా? ప్రగతి శీల సమాజంలో రాజకీయాలను ప్రభావితం చేయొద్దా? అసలు బిజేపి ఆలోచన ఏమిటి? మహిళపట్ల బిజేపికి వున్న చిన్న చూపు ఏమిటో ఇప్పటికే అనేక సార్లు రుజువైంది. వాళ్లు చెప్పే మాటలకు, చేసే చేతలకు ఎక్కడా పొంతన లేదన్నది అనేక సార్లు రుజువు చేసుకుంటూనే వున్నారు. ప్రజలకు బిజేపి పార్టీ అసలు రంగు తెలిసిపోయింది. ఈసారి ఖచ్చితంగా బిజేపికి దేశ వ్యాప్తంగా బుద్ది చెప్పేరోజులు దగ్గరనే వున్నాయి. తెలంగాణ రాజకీయ యవనికపై కల్లకుంట్ల కవితది సామాన్యమైన పాత్ర కాదు. నిజానికి ఆమె తెలంగాణ ఉద్యమానికి అందించిన చేయూత అంతా ఇంతా కాదు. సహజంగా ఎవరైనా రాజకీయావకాశాలు కలిసి వచ్చినప్పుడు చేస్తుంటారు. అంతదాకా ఎందుకు సినిమా నటులు రిటైర్‌ అయ్యే దశలో రాజకీయాల్లోకి వస్తుంటారు. ప్రజా సేవ అంటూ చెబుతుంటారు. రాజకీయాలలో అనూహ్యంగా కొందరు తెరమీదకు వస్తుంటారు. కాని కవిత రాజకీయాలు అందుకు భిన్నం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమాన్ని మొదలుపెట్టి, ఎండనక, వాననక సాగిస్తున్న పోరాటాన్ని చూసి, తాను కూడా తెలంగాణ ఉద్యమంలో తరుపుకు ముక్కనౌతానని వచ్చిన నాయకురాలు కవిత. ఉన్నతమైన విద్య, చక్కని ఉద్యోగం, కుటుంబ జీవనం,చిన్న పిల్లలు, అమెరికాలో జీవనం అన్నీ కాదనుకొని, మళ్లీ తెలంగాణ గడ్డ మీద అడుపెట్టి ఉద్యమంలో చురుకైన, ప్రత్యేకమైన పాత్ర పోషించిన నాయకురాలు కవిత. ఇంట్లో చిన్న పిల్లల్ని వదిలేసి, తెలంగాణ ప్రజల జీవితాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకురాలు కవిత. ఇప్పుడన్న పరిస్ధితుల్లో అప్పటి కాలం చిన్నగా కనిపించొచ్చు..కాని ఆనాడు ఉద్యమ కారులు పడిన శ్రమ ఎంతో అనుభవించినవారికే తెలుస్తుంది. తాడు బొంగరం లేని బిజేపి నాయకులు ఏవోవో మాట్లాడతారు? ఎందుకంటే బిజేపిలో సీనియర్లమని చెప్పుకునేవారికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. ఉద్యమంలో వాళ్లు పాల్గొన్నది లేదు. ఇక ఇప్పుడు పెద్ద నాయకులమైనట్లు వ్యవహరిస్తున్న వారికి అసలు తెలంగాణ ఉద్యమస్వరూపమే తెలియదు. అందుకే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కవిత లాంటి ఉద్యమ కారులను పదేపదే అవమానిస్తున్నారు. రాజకీయాల్లో ఇది మంచి సంప్రదాయం కాదు…ఏది ఏమైనా కవిత లాంటి నాయకురాలు తెలంగాణ రాజకీయాల్లో వుండడం అన్నది తెలంగాణ సమాజం గర్వించదగ్గ విషయం. ఉద్యమ కాలం నాటి కుట్రలు, కుతంత్రాలు చూసిన కవితకు, బిజేపి ఉడుత ఊపులకు భయపడదు. ఆమె వెంట మొత్తం తెలంగాణ మహిళా సమాజమే కాదు, దేశంలోని మహిళలంతా కదలుతారు…అంటున్న బిజేపి అసహనం, దొడ్డి దారి పైత్యం, రాజకీయం కోసం చిల్లర జిత్తులు తెలంగాణలో సాగవంటున్న భూపాలపల్లి జిల్లా ‘‘బిఆర్‌ ఎస్‌’’ పార్టీ అధ్యక్షురాలు, వరంగల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ‘‘గండ్ర జ్యోతి’’,నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో చిట్‌చాట్‌… ఆమె మాటల్లోనే…

కవిత విషయంలో కావాలనే బిజేపి రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. 

ఇదంతా దేశమంతా చూస్తోంది. ఒక మహిళ పట్ల బిజేపి ప్రభుత్వం చేస్తున్న దాడి, మొత్తం మహిళా సమాజం మీద జరుగుతున్నట్లే లెక్క. పూట పూటకు, రోజు రోజుకు కవిత మీద ఎన్నో ఆరోపణలు, చిల్లర విమర్శలు సాగిస్తున్నారు. కవిత ఏ పని చేసినా అది భవిష్యత్తు సమాజానికి దిశా నిర్ధేశం చేసేలా వుంటుంది. అందులో భాగంగానే ఈడీ విచారణ అన్నది కూడా రాజ్యాంగ బద్దంగా సాగాలి. చట్టబద్దంగా వుండాలి. మహిళల హక్కుల రక్షణ అమలు కావాలి. అంతే గాని ఎంపిగా కేంద్ర అత్యున్నత చట్ట సభకు ప్రాతినిధ్యం వహించి, ఇప్పుడు రాష్ట్రంలో పెద్దల సభ సభ్యురాలైన కవిత పట్లనే ఈడీ ఇలా వ్యవహరిస్తుంటే, ఇక సామాన్యమైన మహిళకు దేశంలో రక్షణెక్కడిది. దర్యాప్తు న్యాయంగా జరగాలని కవిత కోరుతోంది. అది కూడా తప్పేనా…పక్షపాతంగా కక్ష పూరితంగా సాగొద్దని మహిళా సమాజం కూడా కోరుతోంది. ఎంత సేపు పిఎంఎల్‌ఏ చట్టంలో అది వుంది..ఇది వుంది…అంటూ లేని భాష్యాలు బిజేపి నేతలు చెప్పడంలో ఆంతర్యమేమిటి? ఈ చట్టంలో ఇప్పటికే అనేక సార్లు మర్పులు చేశారు… మన దేశంలో అత్యున్నతమైన రాజ్యాంగంలోనే కాలనుగుణంగా అనేక మార్పుల చేశారు..అలాగే ఈడీ నిబంధనలు కూడా మార్చారు. కాని ఈడీ ముందు ఎవరైనా ఒక్కటే అంటూ వితండ వాదాలు చేస్తూ, మహిళల హక్కులను కించపర్చడమేనా బిజేపి నేతలు నేర్చుకున్న విలువలు. కవిత ఇప్పటికే నాలుగు సార్లు అటు ఈడీకి గాని, ఇటు సిబిఐకి గాని సహకరించిన విషయం తెలిసిందే..అయినా ఆమె సహకరించడంలేదని బిజేపి అసత్య ప్రచారం చేయడం సరైంది కాదు. నిజానికి సిఆర్‌పిసిచట్టం 160 ప్రకారం ఒక మహిళను ఏ సందర్భంలోనైనా విచారించాల్సి వస్తే కచ్చితంగా ఆమెకున్న హక్కులకు లోబడే దర్యాప్తు జరగాలి. కాని ఈడీ ఇందుకు మినహాయింపు కాదు..ఈడీ కవిత సెల్‌ఫోన్‌ లాక్కోవడం నిబంధనలకు వ్యతిరేకం అన్నది న్యాయనిపుణులు చెబుతున్న మాట. ఇదే ఆమె ఈడీని ప్రశ్నిస్తోంది. పైగా ఈడీ తన పరిధిలో లేని, తనకు సంబంధం లేని అంశాల ప్రస్తావన తీసుకురావడం కూడా తన పరిధి దాటి వ్యవహరించడం కాదా? ఇదిలా వుంటే ఈడి విచారణ సమయంలో అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ కవిత లేఖాస్త్రం సంధించారు. ఆమె ధైర్యానికి ఇది ఒక సంకేతం. ఎందుకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండాపోరాటం చేసిన వనిత కవిత. అలాంటి కవితను ఈడి బెదిరిస్తే కవిత బెదురుతుందా? అదురుతుందా? 

ఈ రోజు కొన్ని మీడియా సంస్ధలు కవిత మళ్లీ సుప్రింకోర్టును ఆశ్రయించినట్లు, కవిత విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చినట్లు ఎవరికి వారు కట్టుకధలు అల్లి ప్రచారం సాగించారు.

ఇదేనా మీడియాకు ఒక మహిళా నాయకురాలు, ఉద్యమకారురాలు పట్ల వ్యవహరించాల్సిన తీరు..మీడియా కూడ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీడియా సమజాంలో జరిగే విషయాలపై నిజానిజాలు తెలియజేసేలా వుండాలే, గాని మీడియాకూడా లేనిపోనివి సృష్టించడం తగదు. ఈడీ కూడా తన పరిధి దాటి చేస్తున్న విన్యాసాలు కూడా సరైనవి కాదు. ఆ సంస్ధ మీద బిజేపి పెద్దల ఒత్తిడి ఎంతో వుందనేది వాస్తవం. అయినా రాజ్యాంగబద్దమైన సంస్ధ ఇలా వ్యవహరిస్తూ, సమన్లు జారీ చేసిన సమయంలో చెప్పని విషయాలను కూడా ప్రస్తావించడాన్ని కవిత ఎంతో ధైర్యంగా ప్రశ్నించింది. అందుకు కవితను ప్రతి మహిళ అభినందించాలి. కవిత ఫోన్‌తో ఈడీకి ఏం సంబంధం? ఫోన్‌అనేది వ్యక్తిగతమైనది. అందులో అనేక అంశాలుంటాయి. అలాంటి ఫోన్‌ను తెప్పించి, స్వాదీనం చేసుకోవడం వ్యక్తిగత హక్కును, స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సహజంగా ఆరు గంటల వరకే దర్యాప్తు జరగాలి. కాని కవితను రాత్రి 8గంటలదాకా విచారణ చేయడం అంటే కుట్ర కోణం దాగి లేదా? ఈ నెల 11న జరిగిన విచారణలో నిందితుల ముందు ఈడీకి వున్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసమే అనుమానితురాలిగా కవితను విచారణకు పిలిచారు. మరి కవిత ప్రశ్నించినట్లుగా నిందితులను ఆమె ముందుకు ఎందుకు తీసుకురాలేదు? ఇది ఈడీ ఉల్లంఘన కాదా? ఒక మహిళా నేతమీద ఈడీ వ్యవరిస్తున్న తీరుపై దేశమంతా చర్చజరుగుతోంది. బిజేపి కుట్రనంతా గమనిస్తోంది. కవిత లాంటి నాయకులనే భయపెట్టామన్న ప్రచారం చేసుకోవడం కోసం, బిఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్న బిజేపికి తగిన బుద్ది ప్రజలే చెబుతారు..దేశం నుంచి బిజేపిని తరిమికొడతారు..వినేశ కాలే వివపరీత బుద్ది అని బిజేపి తన అహంకార పూరిత రాజకీయాలకు కాలం చెల్లే రోజులు దగ్గరనే వున్నాయి. కవిత విషయంలో దేశంలోని మహిళా సమాజమంతా ఆమెకు మద్దతుగా వుంటుంది. కేంద్రాన్ని ఎండగట్టేందుకు ఎల్లప్పుడు మహిళా లోకం సిద్దంగానే వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *