ఎన్నికల ఖర్చుల్లో గోల్‌మాల్‌ : ఎన్నికల విధుల్లో పనిచేసిన అన్ని వ్యవస్థల్లోనూ ఇదే తంతు….

కమీషన్లే ఆయన ప్రధాన కర్తవ్యం. విధులు నిర్వహించే శాఖలోనైనా, అతని భాద్యత నిర్వహించే ఏ పనిలోనైనా ఆయనకు వ్యవస్థను అవినీతిమయం చేయడం వెన్నతో పెట్టిన విద్య. పైకి మాములూగా నవ్వుతూ అంతా సవ్యంగానే చేస్తున్నట్లు కనిపించినా ఆ నవ్వు మాటున అవినీతి అర్రులు చాచుకుని ఆనంద తాండవం చేస్తుంది. గత 7నెలలుగా జరుగుతున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది రెవెన్యూశాఖ. ఈ శాఖలోనూ పనిచేస్తున్న ఈయన ఈ వ్యవహారంలోనూ ఆయన వ్యవహారశైలిని మార్చుకోలేదు. ఇంకే ముంది ఎన్నికల విధుల్లో పాల్గోన్న సిబ్బందికి సంబంధించి వచ్చిన టిఎ, డిఎల్లో భారీగా దండుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఈ వ్యవహారం ఇప్పుడే జరుగుతున్నది కాకపోయినా తాజాగా ఈయన వ్యవహరిస్తున్న తీరు పట్ల విసుగు చెందిన ప్రభుత్వ అధికారులే ఈయన జరుపుతున్న వ్యవహారంపై బహిరంగ విమర్శలు చేస్తున్నారంటే సదరు రెవెన్యూ అధికారి ఆగడాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పకనే చెబుతున్నారు. ఇక ప్రభుత్వ అధికారుల పరిస్థితే ఇలా ఉంటే ఎన్నికల విధుల్లో పనిచేసిన అనధికార వ్యవస్థకు సంబంధించిన వారి పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది.

వివిధ శాఖల అధికారుల అలవెన్స్‌లలో కమీషన్లు…

శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికలతోపాటు ఇతర ఎన్నికల విధుల్లో భాద్యతలు నిర్వహించిన వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారుల రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల నుండి గెజిటెడ్‌ అధికారులు మైక్రో అబ్జర్వర్లుగా, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, వీడియో సర్వేలైన్స్‌ టీం, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, ఎస్‌ఎస్‌టి విభాగాలకు సంబంధించి శాసనసభ ఎన్నికల్లో 52రోజులు, పార్లమెంట్‌ ఎన్నికల్లో 22రోజులు విధులు నిర్వహించారు. వీరు నిర్వహించిన విధులకుగాను ఎన్నికల కమీషన్‌ ఇచ్చిన అలవెన్స్‌లలో భారీగా కమీషన్ల రూపంలో దండుకున్నారు. పనిచేసిన కాలానికి ఎంత మొత్తం వచ్చింది అని వారు అడిగినప్పటికి పూర్తి అలవెన్స్‌ రాలేదని, ఇంతే వచ్చిందని మరికొందరు అధికారులకు చెప్పి వారితో అలవెన్స్‌లు ముట్టినట్లు సంతకాలు తీసుకున్నారు. సదరు రెవెన్యూ అధికారి వ్యవహరిస్తున్న తీరుపై చేసేదెమి లేక ఇచ్చిందే పుచ్చుకుని సైలెంట్‌ అయ్యారు.

ఎన్నికల విధుల్లో పనిచేసిన అన్ని వ్యవస్థల్లోనూ ఇదే తంతు….

ఎన్నికల విధుల్లో భాగమైన ప్రైవేట్‌ వాహనాలు, ఫోటో, వీడియోగ్రాఫర్లు, టెంట్‌హౌజ్‌ ఇలా అన్ని వ్యవస్థల్లోనూ ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించినట్లు సమాచారం. ఉన్నతస్థాయి గెజిటెడ్‌ అధికారుల అలవెన్స్‌లలోనే కమీషన్లకు దిగిన ఆయనకు అనధికార వ్యవస్థలో విధులు నిర్వహించిన వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. వారికి పూర్తి డబ్బులు ఇవ్వకపోగా ఇచ్చిన డబ్బులు ఇవ్వడానికి ముందుగానే తన చేతివాటంతో లంచాలు తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల విధులకు సంబంధించిన వీరికి వచ్చిన నిధులను సగానికిపైగా స్వాహా చేసి అధికారులు వాటాలు పంచుకున్నారని, ప్రతి ఎన్నిక సందర్భంలోనూ రెవెన్యూ అధికారులు ఇలానే చేస్తారని ఫోటో, వీడియోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల కమీషన్‌ ఎంత కేటాయించిందో అంతా గోప్యం…

ఎన్నికల సంధర్భంగా విధులు నిర్వహించిన వివిధ విభాగాల వారికి కమీషన్‌ అలవెన్స్‌లు, ఖర్చుల కొరకు నిర్ధిష్టమైన మొత్తాలను కేటాయిస్తారు. కానీ ఈ ఖర్చుల మొత్తాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. విధులు నిర్వహించిన ప్రభుత్వ గెజిటెడ్‌ తెలుపుతున్న సమాచారం ప్రకారం అలవెన్స్‌లుగా 1200రూపాయలు ప్రతిరోజుకు ఇస్తారని అంటున్నారు. అధేవిధంగా ఫోటో, వీడియో గ్రాఫర్లకు భోజన ఖర్చులకు, టెంట్‌ హౌజ్‌, కిరాయి వాహనాలకు ఖర్చులను కేటాయిస్తారు. కానీ ఎవరికి ఎంత కేటాయిస్తారనేది మాత్రం రెవెన్యూ అధికారులకు మినహాయించి మరెవ్వరికి తెలియదు. తెలియకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. పనిచేసిన వారికి వచ్చిన అలవెన్స్‌లు, జీతభత్యాలు, ఖర్చులకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఎందుకు ఉంచుతారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

స్థానిక రెవెన్యూ అధికారి కనుసన్నలోనే వ్యవహారమంతా…?

స్థానికంగా రెవెన్యూ కార్యాలయంలో కీలక అధికారి అయిన ఒకరి చేతుల్లోనే ఈ వ్యవహారమంతా జరుగుతుందని ఎన్నికల విధుల్లో పని చేసిన వారు చెబుతున్నారు. కీలక అధికారి కావడంతో సమన్వయలోపం ఏర్పడుతుందని చేసేదేమి లేక ఇచ్చిన మొత్తాన్నే విధులు నిర్వహించిన వివిధ శాఖల అధికారులు తీసుకుంటే, ఇక అనధికార వ్యవస్థకు సంబంధించిన వారు ఇదేంటని అడిగితే మరోమారు వారి అవకాశం ఇవ్వరనే భయంతో ఆ అధికారిని ప్రశ్నించడం లేదు. దీంతో ఆయన చేస్తున్న అవినీతి వ్యవహారానికి అడ్డుఅదుపు లేకుండా పోయింది. సదరు అధికారి చేస్తున్న అవినీతిలో ఉన్నత అధికారులకు వాటాలు చేరుతాయని, అందుకే వారు కూడా ఈ వ్యవహారం గురించి నిమ్మకు నిరెత్తనట్లు వ్యవహరిస్తూ ఆయనకు అవసరమైన అండదండలు అందిస్తారని అందరు చెప్పుకుంటున్నారు. సమాజంలో కీలకశాఖలో పనిచేస్తూ ప్రతి అంశంలో అవినీతికి పాల్పడుతూ ఇటు ప్రజలను,అటు అధికారులను వదలకుండా చేస్తున్న వ త్తికి కలంకం తెస్తున్న సదరు అధికారి వ్యవహారం గురించి సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి తగిన విచారణ చేసి ఎన్నికల విధుల్లో పాల్గోన్న సిబ్బందికి, ప్రజలకు న్యాయం చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *