సిఐటియు నేతల నిర్భందం

115

సిఐటియు నేతల నిర్భందం

సిఐటియు అర్భన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు యం. చుక్కయ్య ను హన్మకొండ పోలీసులు నిర్భంధించారు. మంగళవారం అర్థరాత్రి ఇండ్లలో నిద్రిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా సంభవించిన హఠత్పరిణామంలో చక్కయ్య, రాగుల రమేష్‌ కంగుతిన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపునే హన్మకొండ పోలీసు స్టేషన్‌కు తరలించి నిర్బందం చేశారు. బుధవారం గ్రామపంచాయతీ కార్మికులు ప్రగతిభవన్‌ ముట్టడికి సిద్దమైన కారణాన్ని చూపుతూ సిఐటియు నేతలను అదుపులోకి తీసుకొని నిర్భందించిన పోలీసుల చర్యలను సిఐటియు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు తివ్రంగా ఖండించాయి. ప్రజాసంఘాలు గురువారం (నేడు) జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేయటానికి సిద్దమయ్యాయి. సిఐటియు అనుబంధంగా ఉన్నటువంటి గ్రామపంచాయతీ కార్మికుల సంఘం ఉన్నందున ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని అదుపుచేయటంలో భాగంగా నాయకులను నిర్భంచటం సరైంది కాదని ప్రజాసంఘాలు పోలీసుల తీరుపట్ల మండిపడ్డాయి. రాష్ట్రంలో నిర్భందం చాపకింద నీరులా కొనసాగుతుందనటానికి తమ అక్రమ నిర్భంమే సాక్ష్యమని నిర్భందిచబడిన నాయకులు చుక్కయ్య, రమేష్‌లు వెల్లడించారు. అర్థరాత్రి అదుపులోకి తీసుకోని నిర్భందించటం భయబ్రాంతులకు గురిచేయటమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో సంఘాలు పెట్టుకొని హక్కులకోసం పనిచేయటమే నేరమైనట్లు పాలకుల విధానాలు నిరంకుశంగా ఉన్నాయని ఆరోపించారు.అక్రమ అరెస్టులు, నిర్భందాల ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజాఉద్యమాలను ఆపలేరనే విషయాన్ని పాలకులు గుర్తించాలని అన్నారు.నిర్భంద చర్యలను ప్రజలు ప్రజాతంత్రవాదులు, ప్రజాసంఘాలు, మేధావివర్గం ఖండించాలని కోరారు. నిర్భంద చర్యలను నిరసిస్తూ నేడు జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర, జిల్లా కమిటీలు పిలుపునిచ్చినట్లు చుక్కయ్య, రమేష్‌ తెలిపారు.