నగరంలో ప్లాస్టిక్‌ అమ్మకాల జోరు

309

నగరంలో ప్లాస్టిక్‌ అమ్మకాల జోరు

మానవాళి మనుగడకు పర్యావరణానికి ప్లాస్టిక్‌ ప్రమాదకరంగా మారుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా, వినియోగం మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వీటిని అరికట్టేందుకు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. నగరంలో రోజురోజుకి పెరుగుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు.

వరంగల్‌ నగరంలో ఎక్కడా ప్లాస్టిక్‌ నిషేధం అమలుకావడం లేదు. ఇటీవల గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో దుకాణాలపై దాడులు నిర్వహించి ప్లాస్టిక్‌ అమ్మకాలను అరికట్టినప్పటికీ మళ్ళీ విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. రోడ్లపై చెత్త కనపడకుండా చేయడంలో చూపుతున్న శ్రద్ధ ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టడంలో చూపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 50 మైక్రాన్ల కన్నా అధిక మందం కలిగిన వివిధ రకాల ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించేందుకు అవకాశం ఉన్నా, వాటి వినియోగం పెరిగే కొద్దీ అనర్థానికి దారితీస్తోంది. ఒక ప్లాస్టిక్‌ వస్తువు భూమిలో కలిసిపోవాలంటే కనీసం వెయ్యి సంవత్సరాలు పడుతుందనేది అంచనా. నగరంలో ఇడ్లి బండి మొదలుకుని కిరాణ దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, బిర్యానీహౌస్‌లు, కర్రీ పాయింట్లలో వీటి వినియోగం ఎక్కువగా ఉంటోంది. ప్లాస్టిక్‌ సంచులకు ప్రత్యామ్నాయంగా జ్యుట్‌ సంచుల వినియోగం పెంచాల్సిన అవసరముంది. కొద్దికాలం జ్యుట్‌ బ్యాగులు చాలా షాపుల్లో దర్శనమిచ్చాయి. కానీ ప్లాస్టిక్‌ వాడకానికి అలవాటుపడిన ప్రజలు వాటిని పట్టించుకోకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని చెపొచ్చు. డంపింగ్‌ యార్డులు ఎన్ని ఉన్నా, బహిరంగ ప్రాంతాల్లో చెత్త అంటుపెడితే అందులో ప్లాస్టిక్‌ నీళ్ల బాటిల్‌, పాలిథిన్‌ కవర్లు చాలావరకు ఉండటంతో వీటి వల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం చాలావరకు ఉంటుందని వైద్యులు చెప్పున్నారు. గ్రేటర్‌ అధికారులు చిత్తశుద్ధితో దృష్టిసారిస్తే వీటిని అరికట్టడం సాధ్యమని చెప్పొచ్చు.

కుప్పలు తెప్పలుగా వ్యర్థాలు

చెత్త కొనుగోలు కేంద్రం వద్ద నిత్యం కుప్పలు తెప్పలుగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి. కొనుగోలు కేంద్రాల ద్వారా వారానికి టన్నుల కొద్ది ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎగుమతి చేస్తున్నారు. రోడ్లపై వాడి పడేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను తినడం ద్వారానే పలు పశువుల ప్రాణాలు గాలిలో కలసి పోతున్నాయని పర్యావరణ ప్రేమికులు చెపుతున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు జీవకోటికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ప్లాస్టిక్‌ సంచుల ఉత్పత్తి, వినియోగం రెండూ అధికంగానే జరుగుతున్నాయి. వినియోగం జీవరాశులకే కాదు మొత్తం ప్రపంచానికే ముప్పు పొంచి ఉందని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లాస్టిక్‌ సంచులు నిషేధించి జంతువుల పట్ల కారుణ్యం చూపాలని దేశసర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పల్లెల్లో పేరుకుపోయిన టన్నుల కొద్ది ప్లాస్టిక్‌ అసాంఖ్యాక మూగజీవుల ఉసురు తీస్తున్నాయి. కొంతమంది ప్లాస్టిక్‌ వ్యర్థాలను తరలించలేక తగలపెడుతుంటే వాటినుండి వచ్చే విషవాయువులు సైతం ప్రాణాంతకంగా మారుతుంది. 50మైక్రాన్‌ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ సంచుల వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించినా అధికారులు, అప్పట్లో మొక్కుబడిగా ప్రచారం నిర్వహించారు. ప్లాస్టిక్‌ నిషేధం దిశగా అధికారులు ప్రత్యేక దష్టిసారించి పూర్తిస్థాయిలో నిషేధించాల్సిన అవసరం ఉంది.

పేరుకే ప్లాస్టిక్‌ నిషేధం

ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్లాస్టిక్‌ కవర్లను ప్రభుత్వం నిషేధించినా అమలు మాత్రం చేయడం లేదు. పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, తినుబండారాలు దేన్నయినా ప్లాస్లిక్‌ కవర్లలోనే ఇస్తున్నారు. వినియోగదారులు కూడా ఇండ్ల నుంచి సంచులు తెచ్చుకోవడమే మరిచారు. గతంలో గ్రేటర్‌ కార్పొరేషన్‌ అధికారులు ప్రజలకు, వ్యాపారులకు కొంతవరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా వ్యాపారులు తయారయ్యారు. రోడ్లు, కాలువలు, ఇండ్ల ముందు, సినిమా హాళ్ల వద్ద ఎక్కడ చూసినా పాలిథిన్‌ కవర్లే దర్శనమిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ప్లాస్టిక్‌ కవర్లు 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న వాటిని నిషేధించింది. అంతకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు భూమిలో కలిసి నీరు, భూమి పొర విషతుల్యం అవుతాయి.

అవగాహనరాహిత్యమే అసలు కారణం

ప్లాస్టిక్‌ కవర్ల వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడటంతోపాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. 50మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్‌ సంచులను వాడరాదని ఆదేశాలున్నా వినియోగదారులకు అమ్మకందారులు విక్రయిస్తున్నారు. వర్షాకాలంలో పాలిథిన్‌ కవర్లు వినియోగించి పడేసిన తర్వాత కాల్వల్లో నీటికి అడ్డుగా నిలిచి మురుగునీరు కావటం వల్ల ప్రజలు దోమలు, ఈగలతో రోగాల బారిన పడుతున్నారు. ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం వల్ల వాటి రసాయనాలు తినే పదార్థాల ద్వారా శరీరంలోకి చేరి క్యాన్సర్‌ వంటి వ్యాధులు ప్రబలడానికి కారణమవుతున్నాయని వైద్యులు చెపుతున్నారు. టీకప్పు నుండి మొదలుకుని…భోజనంచేసే విస్తారి వరకు ప్లాస్టిక్‌తో తయారు చేసినవే వాడుతున్నారు. ఒకప్పుడు పల్లెల్లో విస్తరాకులను ఆకులతో కుట్టేవారు, ఇప్పుడు రెడీమెడ్‌ ప్లాస్టిక్‌ తయారీతో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఇలా ప్రజలు అధికసంఖ్యలో ప్లాస్టిక్‌ను వినియోగించడం వల్ల వాతావరణం కలుషితమవుతోంది. భూతాపం పెరిగి అన ర్థాలకు దారితీసే అవకాశాలు అధికమవుతున్నాయి. ఈ సమయంలో గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో వ్యాపారులపై అధికార యంత్రాంగం వ్యాపారులపై కొరడా ఝలిపించాలని, వాడకంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ఇలా అయినా కొంతవరకు పర్యావరణ పరిరక్షణలో ప్రజలతో కలిసి భాగస్వాములు కావాలని కోరుతున్నారు. ప్లాస్టిక్‌ వస్తువుల వాడకాన్ని నిషేధించాలని, ప్లాస్టిక్‌ స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి అధికారులు ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తూతూ మంత్రంగా దాడులు

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ప్లాస్టిక్‌ వ్యాపారం లక్షల్లో నడుస్తున్నా, కార్పొరేషన్‌ అధికారులు వ్యాపారస్తులను వదిలి టిఫిన్‌ సెంటర్లు, ఇతరత్రా చిన్న వ్యాపారస్తులను టార్గెట్‌చేసి జరిమానాలు విదిస్తున్నారే తప్ప పెద్ద, పెద్ద షాపింగ్‌మాల్‌, బడా వ్యాపారస్తులపై కనీసం దష్టి సారించటం లేదని చిరువ్యాపారులు ఆరోపిస్తున్నారు. బడా వ్యాపారులు అమ్మితేనే మేము కొనుక్కుని వచ్చి రోజు గడవలేని స్థితిలో మేము వ్యాపారం చేసుకుంటుంటే మాపై ఇలా దాడులు చేయటం అదికారులకు సమంజసం కాదని, ఏదైనా ఉంటే పెద్దఎత్తున అమ్ముతున్న వ్యాపారస్తులను కట్టడి చేస్తే మాకు ఈ పరిస్థితి రాదని వాపోతున్నారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు షాపింగ్‌ మాల్స్‌, పెద్దఎత్తున పాలిథిన్‌ సంచులు అమ్మే వ్యాపారస్తులపై దష్టిసారించి వారికి జరిమానా విధించి చర్యలు తీసుకోవాలని చిరువ్యాపారులు కోరుతున్నారు.

ప్రజల సహకారంతోనే ప్లాస్టిక్‌ నివారణ సాధ్యం

– జిడబ్ల్యుఎంసి ఎంహెచ్‌వో డాక్టర్‌ రాజారెడ్డి

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పాలిథిన్‌ కవర్లు అమ్ముతున్న దుకాణాలపై గత 15రోజులుగా దాడులు నిర్వహించి జరిమానాలు వేస్తున్నామని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి తెలిపారు. గత 3సంవత్సరాల నుండి జరిమానా రూపంలో 11లక్షల ఆదాయం వచ్చాయని అన్నారు. ప్లాస్టిక్‌ నివారణలో భాగంగా సిబ్బంది రెండు బందాలుగా ఏర్పడి దుకాణ యాజమానులకు అవగాహన కలిపిస్తున్నామని, మరో పదిహేను రోజులు అవగాహన తరువాత యాజమానులకు భారీ జరిమానాలు విధించి కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ 15రోజుల నుండి దాడులు చేసి 35నుండి 40వేల జరిమానాలు విధించినట్లు డాక్టర్‌ రాజారెడ్డి తెలిపారు. గత కొన్ని నెలలుగా పిన్నవారి వీధిలో ప్లాస్టిక్‌ దుకాణదారులకు 1.20లక్షల రూపాయలపైన జరిమానా వేసామనన్నారు. 50మైక్రాన్‌ల కన్నా ఎక్కువ మందం ఉన్న వారి అమ్మకాలకు కార్పొరేషన్‌ వారికి ప్రతినెల 4500చాలాన రూపంలో కట్టవలసి ఉంటుందని తెలిపారు. ప్రజలకు జ్యుట్‌ (నేత) బ్యాగులు వాడాలని, కొన్ని స్వచ్చంద సంస్థలను ఏర్పాటుచేసి నిరంతరం వారినుండి నేను సైతం పర్యావరణరహితం అనే నినాదంతో ప్రజల ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ నివారణకు ప్రజలు కూడా సహకరించాలని గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ అధికారి ఎంఎచ్‌వో రాజారెడ్డి తెలిపారు.