వీరాయి చెరువు భూముల సర్వేకు సిద్ధం

101

వీరాయి చెరువు భూముల

సర్వేకు సిద్ధం

గీసుగొండ మండలం గొర్రెకుంట 44 సర్వే నెంబర్‌లో ఉన్న వీరాయి చెరువు భూముల సర్వేకు తాము సిద్దమని రెవెన్యూ అధికారులు అన్నారు. గ్రామస్తులకు ఆదరువుగా ఉన్న చెరువు అన్యాక్రాంతం కాకుండా చూస్తామని వారు హామీ ఇచ్చారు. త్వరలోనే వీరాయి చెరువు భూముల విషయంలో సర్వే నిర్వహించి అసలు చెరువుకు సంబంధించిన 8ఎకరాల 38గుంటల స్థలాన్ని కాపాడుతామని రెవెన్యూ అధికారులు అన్నారు. సోమవారం ‘వీరాయి చెరువా…నువ్వెక్కడ’ శీర్షికన ‘నేటిధాత్రి’లో ప్రచురితం అయిన కథనానికి అధికారులు స్పందించారు. స్థానిక తహశీల్దార్‌ వి.సుహాసిని సర్వేయర్‌కు సర్వే నిర్వహించమని మెమో జారీ చేశారు.

త్వరలో సర్వే నిర్వహిస్తాం

వీరాయి చెరువు భూముల విషయంలో త్వరలోనే భూముల సర్వే నిర్వహిస్తామని గీసుగొండ మండలం సర్వేయర్‌ సంగంరెడ్డి గోపి తెలిపారు. టీఫన్‌ రికార్డు ఆధారంగా ఈ సర్వే నిర్వహిస్తామని సర్వే ల్యాండ్‌ ఆప్‌ రికార్డ్సు నుంచి చెరువు పక్కనున్న భూముల రికార్డ్సు ఆధారంగా సర్వే చేస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఈ సర్వే నిర్వహించి వీరాయి చెరువు హద్దులు నిర్ణయిస్తామన్నారు.

చెరువులోకి 18గుంటలే జరిగా…

– బెల్‌బ్రాండ్‌ యజమాని సామ్యెల్‌

వీరాయి చెరువు భూమిలోకి తాను 18గుంటలు మాత్రమే జరిగానని బెల్‌బ్రాండ్‌ యజమాని సామ్యెల్‌ ‘నేటిధాత్రి’కి స్పష్టం చేశారు. తనకు సంబంధించిన మనుషులతో సర్వే చేయించానని ఈ సర్వేలో 18గుంటలు మాత్రమే ఉన్నట్లు తేలిందన్నారు. ఈ విషయంలో క్లియరెన్స్‌ వచ్చాకే తన భూమిలో పనులు ప్రారంభం చేస్తానన్నారు. గొర్రెకుంటలో 45,46,47,48 సర్వే నెంబర్లలో తనకు 8ఎకరాల పట్టా భూమి ఉందన్నారు.