ప్రైవేటు ఫైనాన్షియర్ల ఇష్టారాజ్యం..!

122

ప్రైవేటు ఫైనాన్షియర్ల ఇష్టారాజ్యం..!

వారంతా నిరుపేదులు, గ్రామీణప్రాంతాలనుండి పట్టణానికి వలస వచ్చిన వలసజీవులు. వ్యవసాయం సంక్షభంలోకి నెట్టివేయబడడంతో రైతులు కూలీలుగా మారారు. కూలీలు వసలజీవులుగా మారారు. పొట్టచేతబట్టుకొని బతుకుజీవుడా అంటూ పనులు వెతుక్కుంటూ పట్టణానికి వలసవచ్చి నెమ్మెదిగా ఇక్కడే స్థిరపడి చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటుచేసుకొని జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలు తమ దుకాణాలను నడుపుకోవడానికి పెట్టుబడికోసం ఫైనాన్షియర్లను ఆశ్రయిస్తున్నారు. వీరి అత్యవసరమే ఫైనాన్షియర్లకు పైసలు దండుకోవడానికి మంచి అవకాశంగా మారిందనేది నగ్న సత్యం.

లైసెన్స్‌లు లేకుండానే వడ్డీవ్యాపారం

వాస్తవవానికి లైసెన్స్‌లు లేకుండా వడ్డీవ్యాపారం నిర్వహించటం ఆర్థికనేరమవుతుంది. ఇష్టారాజ్యంగా అధిక వడ్డీలకు ఫైనాన్స్‌ నడపడానికి లేదు. ప్రభుత్వ నిబంధనలకు లొబడి, బాంక్‌ పరిమితం చేసిన వడ్డీరేట్లను మించకుండా ఫైనాన్స్‌ నడుపాలి. ముందుగా ఫైనాన్‌స నడుపాలంటే ఏదేని సంస్థకు కాని, వ్యక్తులకు సంబందించి రిజిస్ట్రేషన్‌ చేసుకొని లైసెన్స్‌ కల్గిఉండాలి. అలా ఉన్నవారే ఫైనాన్స్‌ నడుపాలి. కాని లైసెన్స్‌లు లేకుండా కోకొల్లలుగా ఫైనాన్షియర్లు తయారు అయ్యారు. ఫైనాన్షియర్లు అంతా సిండేకేట్‌ అయి సామాన్యుల అవసరాలను ఆసరాచేసుకొని చక్రవడ్డీల పేరుతో అన్యాయంగా, అక్రమంగా బనాయించిన వడ్డీలను కట్టాలని వేధింపులకు గురిచేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. లైసెన్స్‌లు లేకుండా సగానికి పైగా ఫైనాన్షియర్లు నడుపుతున్నారన్న విషయం పోలీసులకు, ఐటీ వర్గాలకు తెలసినా వారివైపు కన్నెత్తి చూడటంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నీ ఇంటికొస్తా..లేదంటే ఆఫీస్‌కొస్తా..

ఏయ్‌ డబ్బులు కడుతావా లేదా? తమాషా చేస్తున్నావా? రేపటికల్లా కట్టకపోతే నీ ఇంటికొస్తా..లేదంటే నీ ఆఫీసుకొస్తా..గవన్ని నాకు తెలువదు నేను వస్తానా..అంతే నాకు డబ్బులు కట్టాలి, నువ్వేమి చేస్తవో నాకు తెల్వదు..నాకు మాత్రం డబ్బులు ఇవ్వాలి అంతే..,అని ఫైనాన్షియర్లు నిబంధనలను, షరతులను తుంగలోతొక్కి ఇష్టారాజ్యంగా, భూతులు తిడుతూ, మానసికంగా వేదిస్తూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని సామాన్య ప్రజలు తమ ఆవేదనను వ్యక్తంచేస్తున్నారు. వాస్తవంగా ఎవరైనా తీసుకున్న డబ్బులు కట్టకపోతే ఫైనాన్స్‌ షరతుల విదానం ప్రకారం కోర్టునుండి లీగల్‌ నోటీసులు పంపి తమ డబ్బులు వసూలు చేసుకోవాలి. కాని ఇక్కడ ప్రైవేటు ఫైనాన్షియర్లు తామే కోర్టు అన్నట్టుగా వ్యవహరిస్తూ వేదింపులకు గురిచేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తున్నది. వీరి వేధింపులకు, అవమానాలను భరించలేక ఆత్మహత్యలు సైతం చేసుకున్నవారున్నారు. ఇంతజరుగుతున్నా వీరి ఆగడాలకు కళ్లెంవేయలేకపోతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇష్టారాజ్యంగా నడిపుతున్న ప్రైవేటు ఫైనాన్షియర్లపై కన్నేసి ఉంచాలని ప్రజలు, భాదితులు భావిస్తున్నారు.