పల్లేరు’గాయాల’పై…ఎఎన్‌ఎంల జీవితాలు..!

149

పల్లేరు’గాయాల’పై…ఎఎన్‌ఎంల జీవితాలు..!

మానవుల నిత్యజీవితంలో ఆరోగ్యం చాలా ప్రాధాన్యమైనది. ఆరోగ్యమే..మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనిషి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటేనే మనిషి అన్నిరంగాల్లో అభివృద్ది చెందుతాడు. అందుకే ప్రపంచంలో అన్ని దేశాలు ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యతను ఇస్తాయన్న సంగతి తెలిసిందే. ఇందుకు వ్యక్తుల, కుటుంబాల కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తూనే ఉన్నాయి.ప్రదానంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత ఆరోగ్య పరిరక్షణ కొరకు జిల్లా, ప్రాంతీయ, మండల స్థాయిలో సిహెచ్‌సి, ఆర్‌హెచ్‌సి, పిహెచ్‌సిల పేరుతో ఏర్పాటుచేసి వీటి ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ సంస్థలలో గ్రామీణ ప్రజలతో ప్రత్యక్ష సంబందాలను మెరుగుపరుస్తూ వైద్యసేవలను అందించడంలో పిహెచ్‌సిలలో పనిచేసే ఎ.ఎన్‌.ఎమ్‌, ఎమ్‌.పి.హెచ్‌.డబ్య్లు(ఎఫ్‌)లు కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. భారతదేశ రాజ్యాంగం, వివిధ చట్టాలు, రిజర్వేషన్ల ద్వారా మహిళ సాధికారతలో భాగంగా మహిళలు కూడా విద్యా, ఉద్యోగ రంగాల్లో పురుషలతో సమానఅవకాశాలు పొందుతున్నారు. ఇందులో భాగంగా వైద్యరంగంలో మహిళలదే పై చేయిగా నిలిచింది.

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు వైద్యసేవలు అందించడం కోసం జిల్లా స్థాయిలో 7 హాస్పిటల్స్‌, ప్రాంతీయ స్థాయిలో 31, కమ్యూనిటి హెల్త్‌ సెంటర్లు 114, ప్రాధమిక వైద్య కేంద్రాలు 689, సబ్‌-సెంటర్లు 4,797 ఇవన్నీ కూడా వైద్యం అందించడం కోసం ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. వాస్తవానిక 9,655 సబ్‌-సెంటర్లు మంజూరు కాగా ఇందులో 7,848 మాత్రమే రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎఎన్‌ఎం(ఎఫ్‌)ల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారు. ఇందులో ప్రత్యక్ష్యంగా అందుబాటులో 4,797 ఉన్నాయి. ఇంకా 1,807 పూర్తిగా ఖాళీలు ఉన్నాయి. 16 గ్రామాలకు ఒక పిహెచ్‌సి, 94 గ్రామాలకు సిహెచ్‌సి వైద్యసేవలు అందిస్తున్నాయి. ఇక సబ్‌ సెంటర్ల విషయానికి వస్తే ప్రతి సబ్‌ సెంటర్‌లో ఒక ఎఎన్‌ఎం(ఎఫ్‌) వైద్యసేవలు అందిస్తున్న పరిస్థితి నెలకొన్నది. వాస్తవానికి ఒక ఎఎన్‌ఎం 3వేల జనాభకు వైద్యసేదలు అందించగలదు. కాని అందుకు భిన్నంగా ఒక ఎఎన్‌ఎం 2 గ్రామాల్లో లేదా 5వేల జనాభ కంటే ఎక్కువ మందికి సేవలు అందిస్తున్నారు. దీని వల్ల ఎఎన్‌ఎంలకు తలకుమించిన భారం అవుతున్నది. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను ప్రజల్లోకి తసుకెళ్లే కార్యక్రమం కూడా అదనంగా వీరిపైనే పడటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పిహెచ్‌సి సెంటర్లలో పనిచేసే ఇతర సిబ్బంది డాక్టర్లు కార్యాలయ సిబ్బంది సంఘాల పేరుతో వీరిని బుకాయించి బెదిరింపులకు గురిచేసి వినకపోతే ఇబ్బందులకు గురిచేయడంలాంటివి చేస్తుండటంతో పనిభారమైనా తప్పనిపరిస్థితిలో ఎఎన్‌ఎంలే అదపు పనిని చేస్తున్నారు.

సాధారణంగా ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం చేస్తే వారిని ప్రత్యేక దృష్టితో చూస్తారు. ఎందుకంటే వారికి నిర్ధారిత వేతనము, ప్రత్యేక సౌకార్యాలు, ఉద్యోగ భద్రత, నిర్ధేషిత సమయంలో పనిచేసే సౌకర్యం ఉంటుంది. కాని ఇవన్నీ ఎఎన్‌ఎంలకు ఉండకపోవడం నిజంగా వీరి దురదృష్టకరమే అని చెప్పాలి. ఎఎన్‌ఎంలు పనిచేయాల్సి 8 గంటల కంటే సుమారు 12 గంటలు పనిచేస్తూ దుర్భరమైన జీవితాలను గడుపుతూ వివక్షతకు గురవుతూ విపరీతమైన పని ఒత్తిడి వల్ల వివిధ శారీరక మానసిక రోగాలకు, అనారోగ్యానికి గురవుతూ నానా అవస్థలు పడుతున్నారు. చాలీ చాలని వేతనంతో పనిచేస్తూ, ప్రమోషన్‌ అనే పదానికి ఆమడదూరంలో ఉంటూ సామాజికంగా, ఆర్థికంగా కుంగిపోతూ అనేక అవమానాలను దిగమింగుతూ జీవనోపాధి కోసం, కుటుంబ భాద్యతను నెరవేర్చడం కోసం ప్రభుత్వ ఉద్యోగ ముసుగులో వెట్టి చాకిరి చేస్తున్నారు.

(సొసైటీ ఫర్‌ పబ్లిక్‌ వెల్‌ఫేర్‌ అండ్‌ ఇంటియేటివ్స్‌ వారి సౌజన్యంతో)