ఆరోగ్యశ్రీ బూచి దండుకున్నోళ్లకు దండుకున్నంత..!

ఆరోగ్యశ్రీ బూచి

దండుకున్నోళ్లకు దండుకున్నంత..!

వైద్యం ఖరీదుగా మారడంతో, అనారోగ్యం పాలయితే వైద్యం చేయించుకోవాలంటే పేద, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు కనపడుతున్నాయి. సగటుజీవి అనారోగ్యం పాలయితే వైద్యం చేసుకోవడానికి చేసే ఖర్చు, చేతిలో డబ్బులు లేక చేస్తున్న అప్పు పేదను నిరుపేదగా మార్చివేస్తున్నాయనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇది ముమ్మాటికి అక్షరాల నిజం. అనారోగ్యం బారినపడిన రోగులు ఆరోగ్యవంతులు కావాలంటే అప్పుల బారినపడక తప్పదు. ఇది ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర. అయితే ఈ విషయానిన& గుర్తించిన సర్కార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ పథకం పూర్తిగా పేదప్రజలను వారి ఆరోగ్యాన్ని కాంక్షించి నడుపుతున్నది. అయితే కొంతమంది వ్యక్తులు, అధికారులు, ఆసుపత్రుల మూలంగా ఈ పథకం పక్కదారి పడుతోంది. మేం చెప్పినట్లే సర్కార్‌ వినాలి…మేం చెప్పింది నమ్మాలి అనే డిమాండ్‌తో కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు సంవత్సరంలో రెండు, మూడు సార్లయిన బకాయిలు అంటూ గగ్గొలుపెడుతున్నాయి. కొన్ని ఆసుపత్రి యాజమాన్యాలైతే తమస్థాయికి మించి ఆపరేషన్లు చేశామంటూ రోగుల వివరాలు నమోదు చేసి కొంతమంది అధికారుల సాయంతో దానికి సంబంధించిన ఫైళ్లను క్లియరెన్స్‌ చేసుకుని సర్కార్‌ భారీగా బకాయి పడ్డట్లు సమస్యను మరింతగా జఠిలం చేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని ఓ ఆసుపత్రి యాజమాన్యం ఇటీవల అత్యధిక ఆపరేషన్లు చేశారని వివరాలు నమోదు చేసి, బిల్లులు చెల్లించాలని పైల్‌ పంపి చిక్కుల్లో పడింది. ఒకటే నెలలో ఇన్ని ఆపరేషన్లు ఎలా చేశారని అధికారులు నిలదీస్తే నీళ్లు నమిలారు. దీంతో ఆసుపత్రిలో విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహించి ఆపరేషన్లు అన్ని ఉత్తదేనని, చేయకున్న చేసినట్లు నమోదు చేశారని అధికారులు తేల్చేశారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఆరోగ్యశ్రీ సౌకర్యాన్ని రద్దు చేశారు. ఇంత జరిగిన కొంతమంది అధికారులు ఆ ఆసుపత్రి యాజమాన్యానికి సహకరించి తిరిగి ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేశారు.

సహకరిస్తున్న అధికారులు, పైరవీకారులు..?

ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం కొంతమంది అధికారులు, పైరవీకారులదే పైచేయిగా కనపడుతోంది. ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ రావాలన్న, బిల్లులు ఇష్టారాజ్యంగా రావాలన్న వీరే తమ శాయశక్తులా సహకరిస్తున్నట్లు సమాచారం. ఇందులో వైద్య, ఆరోగ్యశాఖలో పనిచుస్తున్న కొంతమంది అధికారులు, ప్రైవేట్‌ ఆసుపత్రులకు కొమ్ముకాస్తున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రి సామర్థ్యం, రోజుకు ఎన్ని ఆపరేషన్లు చేస్తారు…? అసలు ఆపరేషన్లు జరిగాయా…లేదా…? అని పరిశీలించకుండానే అధికారులు ఆసుపత్రులకు క్లీన్‌ చీట్‌ ఇస్తూ బిల్లుల మంజూరికి ఒకే చెప్తున్నారట. దీంతో ఆరోగ్యశ్రీ బకాయిలు తడిసి మోపెడయ్యాయనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. తెలంగాణ సర్కార్‌ 12వందల కోట్లు ప్రైవేట్‌ ఆసుపత్రులకు బకాయి పడిందని ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమన్యాలు తెగ ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారంపై విమర్శలు అదే స్థాయిలో ఉన్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రులు అసలు ఎన్ని ఆపరేషన్లు నిర్వహించారో లెక్కాపత్రం లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఆపరేషన్లు చేయకున్న చేసినట్లు రోగుల సంబంధించిన నకిలీ వివరాలు నమోదుచేసి ఓ ఏజెన్సీ నుంచి ఆధార్‌కార్డులు సేకరించి కొన్ని ఆసుపత్రులు మోసానికి పాల్పడుతున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. ఇలా చేయడం వల్ల సర్కార్‌ ఎక్కువ మొత్తంలో బాకీ పడకుండా ఎలా ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆపరేషన్‌ చేయకున్న చేసినట్లు ఏజెన్సీ నుంచి ఆధార్‌కార్డులు సంపాదించి నకిలీ డాక్యుమెంట్‌లతో కొన్ని ఆసుపత్రులు చీటింగ్‌ చేస్తున్నాయని విశ్వసనీయ సమాచారం. ఈ తతంగం అంతా గుట్టుచప్పుడు కాకుండా నడిచేందుకు ఆరోగ్యశాఖలోని అధికారులే భారీగా దండుకుని సహకరిస్తున్నారని తెలిసింది.

బకాయి ఉందంటూ గగ్గోలు…అధికారుల సహకారం

సర్కార్‌లో ఓ భాగంగా కొనసాగుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వానికే కొంతమంది వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో నిధులు పక్కదారి పట్టడానికి, అడ్డగోలుగా బిల్లుల మంజూరికి అధికారులే కారణమవుతున్నట్లు తెలిసింది. ప్రైవేట్‌ యాజమాన్యాల నకిలీ దందాకు సహకరిస్తూ పైగా ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదంటూ కొంతమంది అధికారులు ఆసుపత్రుల యాజమాన్యంతో ఆరదోళన చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పాపాలపుట్ట పగిలేదెట్లా…?

పేదప్రజల ఆరోగ్య క్షేమాన్ని కాంక్షిస్తూ నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలో అటు అధికారులు, ఇటు ప్రైవేట్‌ యాజమాన్యాలు ఒక్కటై చేస్తున్న పాపాల పుట్ట పగిలితేనే ఈ పథకం మరింత గాడిలో పడేట్లుగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రులలో విజిలెన్స్‌ విచారణ జరిపి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆపరేషన్లు, రోగుల వివరాలు సేకరించి అసలా…నకిలా…? విచారణ జరిపితే తేలుతుందని పలువురు అంటున్నారు. బకాయిల విషయంలో ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here