వీరాయి చెరువా నువ్వెక్కడ..?
అదేదో సినిమాలో తన చేపల చెరువు తప్పిపోయిందని సినిమాలో హీరో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు. తన చేపల చెరువును వెతికిపెట్టాలని పోలీసులను ముప్పు తిప్పలు పెడతాడు. అచ్చంగా అలాంటి కథే గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలో చోటు చేసుకుంది. అయితే తమ చెరువు తప్పిపోయిందని గ్రామస్తులు ఎవరు ఇంకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. కానీ కథ మాత్రం కాస్త అటు, ఇటుగా అలాగే నడుస్తుంది. గత కొన్ని దశాబ్ధాలుగా గ్రామానికి ఆదరువుగా ఉన్న చెరువు కళ్ల ముందే క్రమక్రమంగా మాయమైపోతుంది. కొంతమంది ఆ చెరువును కావాలనే తప్పిపోయేలా చేస్తూ కనుమరుగు చేస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. గొర్రెకుంట గ్రామస్తులు ‘నేటిధాత్రి’కి తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని వీరాయిచెరువు రెవెన్యూ రికార్డు ఖాస్రాలో 1956 నుంచి కనపడుతూ వస్తోంది. 1956 నుంచి రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటి ఆర్ఎస్ఆర్ వరకు 8ఎకరాల 38గుంటల విస్తీర్ణాన్ని చెరువు కలిగి ఉంది. అయితే ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడం వరంగల్ నగరానికి గొర్రెకుంట కూతవేటు దూరంలో ఉండడం మూలంగా చెరువు చుట్టూ ఉన్న కొన్ని భూములు అధిక ధరలకు అమ్ముడుపోయాయి. రియల్ఎస్టేట్ వెంచర్లు వెలసి కాసుల పంటను పండించాయి. చెరువు చుట్టూ ఉన్న కొద్ది భూములు అమ్ముడుపోవడంతో చెరువుతో ఏం పని అనుకున్నారో ఏమో కాని కొంతమంది కన్ను చెరువుపై పడింది. దీంతో ‘కబ్జాకు కాదేది అనర్హం’ అనే సూత్రాన్ని బాగా ఒంటపట్టించుకున్న కొందరు చెరువును కాజేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఈ చెరువు కింద 20ఎకరాలపైగా భూమి సాగు అవుతుంది.
అసలు చిక్కు ఎక్కడ…?
గొర్రెకుంట వీరాయిచెరువు అప్పుడప్పుడు తప్పిపోతుంది..అప్పుడప్పుడు కనిపిస్తూ వస్తుంది. నిక్షేపంలా ఉన్న చెరువు తనదేనని తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చి వరంగల్లో స్థిరపడ్డ బెల్బ్రాండ్ యజమాని వాదిస్తున్నారు. చెరువు 8ఎకరాల 38గుంటలు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉంటే అందులో 8ఎకరాలు తన పట్టా భూమి అంటూ ఆధారాలు చూపిస్తున్నాడు. చెరువులో 8ఎకరాలు తనదే అయితే మరీ చెరువెక్కడ..? చెరువు నిజంగా తప్పిపోయినట్లా…తప్పించేశారా..? అర్థంకాని విషయం. తాను అస్లీ కాగితాలు చూసి కొనుగోలు చేసి తన పేర పట్టా చేయించుకున్నారని వాదిస్తున్న బెల్బ్రాండ్ యజమాని 3నెలల క్రితం చెరువులో బోర్ వేస్తే రెవెన్యూ అధికారులు ఇటీవలే సీజ్ చేశారు. గ్రామ యువకుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు కదిలారు..సీజ్ చేశారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా బోర్ వేసినందుకు సీజ్ చేశాం అన్నారు తప్ప చెరువులో బోర్ వేశారు. ఈ భూమి చెరువుది మీది కాదని చెపితే బెల్బ్రాండ్ యజమాని ససేమిరా ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అయితే బెల్ బ్రాండ్ యజమాని కొనుగోలు చేశానని చెబుతున్న భూమి దానికి సంబంధించిన పట్టాలు అస్లీవా…నకిలీవా.. అనే విషయం తేలాల్సి ఉంది. 1956 నుంచి ఖాస్రాలో 8ఎకరాల 38గుంటల విస్తీర్ణంలో చెరువు ఉన్నట్లుగా రికార్డులు చెబుతుంటే బెల్ బ్రాండ్ యజమాని సామ్యెల్కు 8ఎకరాల భూమి ఎలా వచ్చిందో అర్థం కాకుండా ఉంది.
బెల్బ్రాండ్ యజమాని భూమెక్కడ..?
తనకు 8ఎకరాలు ఉందంటూ చెరువును చూపిస్తున్న బెల్ బ్రాండ్ యజమాని భూమి అసలు ఎక్కడ ఉంది. చెరువే తన భూమి అని ఫిక్స్ అయిపోయిన ఆయన ఇప్పటి వరకు సర్వే చేయించుకోలేదు. దీంతో ఈయన భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు సరైనవేననా..అనే అనుమానం కలుగుతుంది. అయితే ఈ స్థలం ఆయనదే ఐతే మరీ వీరాయి చెరువు ఎక్కడ..? ఇదంత అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతుంది. ‘లోగుట్టు…పెరుమాళ్లకెరుక’ అన్న చందంగా వీరాయి చెరువు, బెల్ బ్రాండ్ యజమాని 8ఎకరాల పట్టా సంగతి రెవెన్యూ అధికారులు తేల్చాల్సి ఉంది.
చెరువును రక్షించి తీరుతాం…
– గీసుగొండ తహశీల్దార్ వి.సుహాసిని
గీసుగొండ మండలం గొర్రెకుంట వీరాయి చెరువును కబ్జాకు గురికాకుండా కాపాడుతామని గీసుగొండ తహశీల్దార్ వి.సుహాసిని ‘నేటిధాత్రి’కి స్పష్టం చేశారు. 8ఎకరాల భూమి తనదేనని బెల్ బ్రాండ్ యజమాని సామ్యెల్ అంటున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే సర్వే నిర్వహించి చెరువుకు సంబంధించిన హద్దులను ఏర్పాటు చేసి చెరువును కాపాడుతామన్నారు. చెరువు భూమిని ఎవరు కబ్జా చేయాలని చూసిన సహించేది లేదని, ఈ చర్యలకు ఎవరు పాల్పడినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు. సామ్యెల్ తన వద్ద భూమి పట్టాలు ఉన్నాయని చెపుతున్నా నేపథ్యంలో వాటిని పరిశీలించి అవి అస్లీవా…నకిలీవా..నిర్థారించి అసలు తనకేవరు విక్రయించారో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.