ఈటల నీతి డిజిపి సాబ్‌ వారిని మూసేయండి..?

205

ఈటల నీతి

డిజిపి సాబ్‌

వారిని మూసేయండి..?

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల పేషిలో డాక్టర్‌ గంగాధర్‌పై కొనసాగుతున్న అవినీతి బాగోతాన్ని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పలేక, గంగాధర్‌ను పక్కనపెట్టలేక ఈటల ఎక్కడ లేని అసహనాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. సమాధానం చెప్పలేక చతికిలపడ్డ ఆయన ‘నేటిధాత్రి’ జర్నలిస్టులను బెదిరిస్తే సమస్య పరిష్కారం అయిపోతుందనే స్థాయికి దిగజారిపోయారు. ‘నేటిధాత్రి’ గత కొద్దిరోజులుగా ప్రచురితం చేస్తున్న ‘గంగాధరమాయ’ కథనాలకు ఎంతమాత్రం స్పందించకపోగా, అణాకాని కొరగని కొంతమందితో ‘నేటిధాత్రి’ జర్నలిస్టుల గూర్చి పనికిమాలిన చర్చలు జరిపి మీరు పరిష్కరించండని బాద్యతను అప్పగించి తప్పులో కాలేసిన మంత్రి ఈటల తన శాఖ వ్యవహారంపై తాను స్పందించకుండా ప్రైవేట్‌ పిఎలకు, జర్నలిజం పేరు చెప్పి పబ్బం గడుపుకునే కొంతమందితో చర్చలు జరిపితే ఏం జరుగుతుందో అర్థంకాని విషయం. సచివాలయంలో, ఇతర సమావేశాల్లో మంత్రి పాల్గొన్నప్పుడు కొంతమంది జర్నలిస్టులు, ‘నేటిధాత్రి’ కథనాల విషయంలో ప్రస్తావిస్తే చాలు ఒంటికాలుపై లేచి ‘నేటిధాత్రి’ని బండబూతులు తిడుతూ ఈటల తన స్థాయిని తానే దిగజార్చుకుంటూ మంత్రి పదవికున్న విలువను దిగజార్చుతున్నట్లు తెలిసింది.

డిజిపి సాబ్‌…మూసేయండి..?

‘నేటిధాత్రి’లో వెలువడుతున్న వరుస కథనాలకు సమాధానం చెప్పలేక మంత్రి ఈటల రాజేందర్‌ పోలీస్‌శాఖతో వ్యవహారాన్ని సెటిల్‌ చేద్దామనుకున్నారట. రెండురోజుల క్రితం రాష్ట్ర డిజిపిని కలిసిన ఈటల తనపై ‘నేటిధాత్రి’ వరుస కథనాలు ప్రచురిస్తుందని ఏదో ఒకటి చేసి ఆ పత్రిక ఎడిటర్‌, బ్యూరో చీప్‌ను అరెస్ట్‌ చేసే ఉపాయం ఆలోచించాలని డిజిపిని కోరినట్లు సమాచారం. వరంగల్‌ కమీషనర్‌కు చెప్పి ఏదో ఓ కేసులో వారిద్దరిని ఇరికించాలని మంత్రి డిజిపిని కోరి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలిసింది. అధికారం చేతిలో ఉంది కదా..? అని ఇష్టారీతిన ప్రవర్తిస్తే ఎవరు చూస్తు ఊరుకోరని దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందనే విషయాన్ని ఈటలకు గుర్తు లేదనుకుంటా. ఉద్యమాలు సమసమాజం..వెనుకటి మావోయిస్టు కథలు వల్లించి లబ్ధిపొందాలని చూసే ఈటల భావప్రకటన స్వేచ్చను అడ్డుకుని కలాలకు సంకెళ్లు వేయాలనే కుతంత్రానికి తెరతీస్తే ఎలా ఉంటుందో కనీసం బోధపడకుండా ఉండడం నిజంగా బాధకరమే. కథనాలకు సమాధానం చెప్పకుండా నిఖార్సయిన వార్త కథనాల ముందు బొక్కా బొర్లాపడ్డ ఈటల డిజిపిని ఆశ్రయించి వారిని మూసేయండని కోరడంలో అంతర్యం ఏంటో అర్థం కాలేదు. అవినీతిని ప్రశ్నిస్తూ, నిజాలను రాసే ప్రతి ఒక్కరిని ఇలా పోలీసుల సాయంతో దారికి తెచ్చుకోవాలని చూడడం ఇది ముమ్మాటికి బరితెగింపుతనమే.

అమాత్య…తమరిది 6నెలల కాలమే..?

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఓ విషయాన్ని అర్థం అయ్యేలా చెప్పాలని ‘నేటిధాత్రి’ భావిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే కొన్ని కథనాలలో ప్రస్తావించిన కొంతమంది భజనపరుల భజనస్వరం రెట్టింపు కావడం వల్ల మంత్రి చెవులకు సరిగా ఎక్కనట్లు ఉంది. కనుక ఈ భజనపరులను దూరంగా పెట్టి ఈ విషయాన్ని మంత్రి మనసుపెట్టి అర్థం చేసుకుంటారనుకుంటున్నాం. తమరు ఆరోగ్యశాఖ చేపట్టి దాదాపు 6నెలలు అవుతుంది కావచ్చు. కానీ డాక్టర్‌ గంగాధర్‌ అవినీతిని మేం కొండ్రు మురళి కాలం నుంచి ప్రశ్నిస్తున్నాం. తమరి 6నెలల కాలంలో ఏం జరిగిందో మీకు తెలుసు. కానీ ఈ అనధికార ఓఎస్డీ ఓ మంత్రికి మళ్లీ మంత్రి పదవే రాకుండా స్థాయిని దిగజార్చి అభాసుపాలు చేశాడని తమరి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందే కోడై కూస్తున్నారని గుర్తుచేశాం. పైరవీలతో భారీగా దండుకుంటున్నాడని, కీలకమైన ఆరోగ్యశాఖనే పక్కదారి పట్టిస్తున్నాడు. ఏ సీనియర్‌ వైద్యున్ని, అధికారిని సంప్రదించిన అతగాడి అవినీతి చిట్టాను గుక్కతిప్పుకోకుండా ఏకరువు పెడుతున్నారని కథనాల్లో వివరించాం. ఇవన్ని ఏ మాత్రం అర్థంకాని తమరు నన్నే టార్గెట్‌ చేశారు..? దేని వెనకాల ఎవరు ఉన్నారు..? వెళ్లమంటే వెళ్తా..పొమ్మనక పొగ పెడుతున్నారు..? అంతు చూస్తా…ఖతం చేస్తా…అరెస్ట్‌ చేయండి…ఎంతవరకు రాస్తారో చూస్తా అంటూ ఎక్కడ లేని అసహనాన్ని వెళ్లగక్కితే ‘నేటిధాత్రి’ చేసేదేమి ఉండదు. శాఖను సరిదిద్దుకోండి మహాప్రబో అని చెపితే నేను సరిదిద్దుకోను…అంతా నా ఇష్టం అన్నట్లు మీరు వ్యవహారిస్తే దానికి ఎవరు ఏం చేయలేరన్న సత్యాన్ని మీరు గమనించాలి. గుమ్మడికాయ దొంగ..అంటే ఏవో తడుముకున్నట్లు తమరు వ్యవహారించడం ఎందుకో ఇంకా అర్థం కావడం లేదు. ఇంతగా అసహానాన్ని వ్యక్తం చేసే మీరు ‘అవినీతి రాజు’గా స్థిరపడిన డాక్టర్‌ గంగాధర్‌ను ఎందుకు సాగనంపలేకపోతున్నారో కొంతమంది సీనియర్‌ వైద్యులన్నట్లు నిజంగా ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. అనధికార ఓఎస్డీ డాక్టర్‌ గంగాధర్‌ ఒక్కొరిద్దరు ప్రైవేట్‌ పీఎలు మంత్రి అయిన మిమ్మల్నే బ్లాక్‌మెయిల్‌ చేస్తూ పదవిలో కొనసాగుతున్నారని ఇలా వద్దన్న కొనసాగడానికి, మీరు విధుల్లోకి తీసుకోను అని తెల్సిన తీసుకోవాల్సిందే. మేం రావల్సిందే అని బలవంతంగా మీ వద్ద చేరడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉండవచ్చన్న అనుమానాలు సర్వత్రా కలుగుతున్నాయి. ఈ అనుమానాలను పటాపంచలు చేయడానికి తమరు వారిని తొలగించే పని చేయరు కనుకనే ఈ అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. అంటే తమరు చేసిన స్వయంకృత అమపరాధలే తమరిని చుట్టుముడుతున్నాయనే అర్థం అవుతుంది. ఇవన్ని గాలికొదిలేసి ‘నేటిధాత్రి’ పత్రికను, జర్నలిస్టులను ఏదోలా అణచివేయాలని చూడడం ముమ్మాటికి అప్రజాస్వామికమే.