మరుగునపడ్డ ‘సమీకృత మత్స్యాభివృద్ది’ పథకం

మత్స్య మహిళా సొసైటీలను బలోపేతం చేయలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుంది. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ‘సమీకృత మత్స్య అభివృద్ది’ పథకం మారింది. దీంతో ప్రభుత్వ మాటలు నీటి మూటలుగానే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమీకృత మత్స్యాభివృద్ది పథకం పేరుతో రూ.100 కోట్ల నిధులతో సంక్షేమ పథకాలు అమలుకు ప్రభుత్వం పూనుకుంది. ముఖ్యంగా మత్స్య మహిళా సొసైటీల అభివృద్ది కోసం ప్రతి సొసైటీకీ రివాల్వింగ్‌ఫండ్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మత్స్య మహిళా సొసైటీలు సంబురపడ్డాయి. కానీ మత్స్యశాఖ అధికారుల తీరు, సంబంధిత అధికారుల అలసత్వం మూలంగా మత్స్య మహిళాసొసైటీలకు నిరాశే ఎదురవుతుంది. ఇందుకు వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని మహిళా మత్స్య సొసైటీలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలో 23 మహిళా సొసైటీలున్నాయి. ఇందులో 15 సొసైటీలు రివాల్వింగ్‌ ఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. రూరల్‌ జిల్లా పరిధిలో ఉన్న 25 మహిళా సొసైటీలుదరఖాస్తు చేసుకున్నాయి. కానీ నేటికీ ఎలాంటి పురోగతి లేదని పలువురు సొసైటీ సభ్యులు తెలుపుతున్నారు. ప్రతి మత్స్య మహిళాసొసైటీలో 100 మంది సభ్యులు ఉంటే రూ. 3లక్షలు, 100 మందికి పైగా సభ్యులు ఉంటే రూ.5లక్షల ఫండ్‌ అందించి మత్స్య మహిళా సొసైటీల ద్వారా మహిళల అభివృద్ది చేయనున్నట్లుప్రకటించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టకపోవటం విమర్శలకు తావిస్తోంది.

ఎనిమిది నెలలుగా ఎదురిచూపులే…

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో మహిళామత్స్య సొసైటీలు రివాల్వింగ్‌ఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకొని ఎనిమిది నెలలు గడిచినప్పటికీ ఎలాంటి పురోగతి ఎకపోవటం గమనార్హం. జిల్లాలో ఉన్న 23 మహిళా మత్స్య సొసైటీలకు గాను 15 సొసైటీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీరికి రివాల్వింగ్‌ ఫండ్‌ అందించటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక సార్లు అధికారుల కార్యాలయాల చుట్ట తిరిగిన వేసారుతున్నట్లు సొసైటీల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యమే కారణం…?

మత్స్య మహిళా సొసైటీలకు రివాల్వింగ్‌ఫండ్‌ అందించటంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రివాల్వింగ్‌ ఫండ్‌ ఇవ్వకపోవటానికి కారణం ఫండ్‌ లేకనా లేక అధికారుల నిర్లక్ష్యమా అనేది ప్రశ్నార్థకంగా మారిందని పలువురు మత్స్య కార్మిక సంఘాలు తెలుపుతున్నాయి. 100 కోట్ల నిధులతో మత్స్యసొసైటీలకు రివాల్వింగ్‌ఫండ్‌ కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించటం, మరో వైపు దరఖాస్తు చేసుకున్న సొసైటీలకు రేపు, మాపు అంటూ అధికారులు వాయిదాలు పేడుతూ దాటవేత దోరణులకు పూనుకోవటం అనుమానాలకు తావిస్తోంది. ఇట్టి విషయంలో ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

తక్షణమే రుణాలు అందించాలి : మొట్టక కుమారస్వామి

అధికారుల ధోరణితోనే మత్స్య మహిళా సొసైటీలకు అందాల్సిన రుణాలు నిలిచిపోతున్నాయని మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం (ఎంకెఎంకెఎస్‌) రాష్ట్ర అధ్యక్షులు మొట్టక కుమారస్వామి తెలిపారు. రాష్ట్రశాఖ అధికారులు, జిల్లా అధికారులు గందరగోళంగాపరుస్తున్నారు. అవసరమైన అన్ని డాక్యూమెంట్లు అందించినప్పటికీ రుణాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. నెలలు గడుస్తున్నా అధికారులు దృష్టి సారించటం లేదని, అధికారుల మద్య సమన్వయం కొరవడిందన్నారు. జిల్లా అధికారులే సరైన డాక్యూమెంట్లు ఇవ్వకపోవటం వల్ల రుణాలు ఇవ్వటంలో సమస్యలు ఏర్పడుతున్నాయని రాష్ట్ర అధికారులు చెప్తున్నారని తెలిపారు. జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 25 మహిళా సొసైటీలు,అర్బన్‌ జిల్లాలో 15 సొసైటీలు దరఖాస్తు చేసుకొని రుణాల కోసం ఎనిమిది నెలలుగా ఎదురుచుస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు చేపట్టి తక్షణమే రుణాలు అందించాలని డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here