గంగాధర మాయ-4
అమాత్య…
గంగాధర్‌పై ఎందుకంత ప్రేమ..?
వైద్య, ఆరోగ్యశాఖ పేషిలో ఇప్పటికి అనధికారికంగానే కొనసాగుతున్న ప్రొఫెసర్ గంగాదర్పై ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎందుకంత ప్రేమను చూపిస్తున్నాడో అర్థంకాని విషయంగా మారింది. గంగాధర్ గతం, ప్రస్తుతం అంతా వివాదాస్పదంగా, అవినీతిమయంగా ఉన్న ఈటల తన పేషిలో అనదికార ఓఎస్డీగా ఎందుకు కొనసాగిస్తున్నారో అంతు పట్టడం లేదు. వైద్య, ఆరోగ్యశాఖ్లోని అధికారులు, అధిక శాతం వైద్యులు గంగాధర్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈటల మాత్రం ఇవేమి పట్టనట్లు ఆరోపణలు ఎలా ఉన్నా ఇతగాడి అక్రమాలపై నిఘావర్గాలు ఎన్ని నివేదికలు ఇచ్చిన లెక్కలేని తనంతో వ్యవహారించడంపై వైద్య, ఆరోగ్యశాఖలో రకరకాల అనుమానాలు బలపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం లాభసాటి వ్యాపారంగా మారిందని అందరూ చర్చించుకుంటుండగా ఈ శాఖలో కొనసాగుతున్న గంగాధర్ వైద్యశాఖను అడ్డుపెట్టుకుని ఎలా దండుకోవచ్చో బాగా ఒంటపట్టిన వ్యక్తి అని, అందుకే శాఖలో ఇతడు ఆడింది ఆట…పాడింది పాటగా మారుతుందనే విమర్శలు ఉన్నాయి. ఇంతటి ఘనమైన రికార్డు కలిగి ఉన్న గంగాదర్పై ఇన్ని ఆరోపణలు, కథనాలు వచ్చిన మంత్రి ఈటల మాత్రం ఎక్కడ లేని ప్రమేను చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
నిను వీడని నీడను నేనే…
అవును నిజం సమైక్య రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కొండ్రు మురళి నుంచి తెలంగాణ రాష్ట్రంలో నేటి ఈటల వరకు గంగాధర్ అదే అనధికార హోదాలో, అదే పైరవీలు, అక్రమాలతో తన హవాను కొనసాగిస్తున్నాడట. ఎవరెన్ని చెప్పిన, ఎన్ని ఫిర్యాదులు వెళ్లిన గంగాదర్ మాత్రం అక్కడి నుంచి కదలడం లేదట. వైద్య, ఆరోగ్యశాఖలో దాదాపు 90శాతం మంది ఇతగాడి వ్యవహారాలపై గుర్రుగా ఉన్న, శాఖలో ఈయన పెత్తనం ఏంటి బాబోయ్…అంటూ తలలు పట్టుకున్న ఈటల మాత్రం ఇవేమి తెలియనట్లు ఊరుకుంటున్నాడట. మంత్రి పేషికి, సీఎంఓకు ఇతగాడి వ్యవహారంపై ఎన్ని లేఖలు వెళ్లిన ”చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు”గా మారింది తప్ప ఎలాంటి మార్పు లేకుండా ఉందట. కొంతమంది ఉన్నతాధికారులు సైతం వైద్య, ఆరోగ్యశాఖలో గంగాధర్ అతిజోక్యంపై మంత్రి సమక్షంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల చూసిచూడనట్లు వదిలారు తప్ప పక్కనపెట్టే ప్రయత్నం చేయలేదట. ఓ అధికారిక సమీక్షలో ఐఎఎస్ అదికారికే ఏదో చెప్పబోయిన గంగాధర్‌ను ఎవరు నువ్వు…? అని ఆ అధికారి ప్రశ్నించడంతో ఖంగుతిని దిక్కులు చూసినట్లు సమాచారం. ఈ సంఘటన అంతా స్వయంగా మంత్రి సమక్షంలోనే జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. గంగాధర్ అతిజోక్యంతో అసహనానికి గురైన ఆ అధికారి ఈయనతో…జాగ్రత్త అని ఈటలకు సలహా సైతం ఇచ్చాడట. అయినా ఇవేమి మంత్రి ఈటల చెవికెక్కనట్లే కనపడుతుంది. మరోవైపు ఏదో బలమైన కారణం, గంగాధర్‌ను కాపాడుతున్న వారు ప్రభుత్వంలో కీలకస్థానంలో ఉండటం మూలంగానే ఇతగాడిపై చర్యలు శూన్యంగా ఉన్నాయనే అనుమానాలు సైతం కలుగుతున్నాయి. అందుకే మంత్రి సైతం చర్యలకు వెనకాడుతున్నాడని తెలుస్తోంది.
సమీక్షలకు ఈటలతో పాటే…
ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ వ్యాపారాలు తదితర విషయాల్లో తలదూర్చి ఊహకందని రీతిలో సంపాదనకు తెరలేపాడని వైద్యవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల ప్రారంభానికి, అధికారిక సమీక్షలకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల గంగాధర్‌ను తన వెంటేసుకుని తిరుగుతున్నారు. ఆదివారం వరంగల్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభం, కెఎంసిలో అధికారిక ‘సమీక్షలో గంగాధర్ ఈటల వెనకాలే ఉంటూ తనను ఎవరు ఏం చేయలేరని, ఎన్ని కథనాలు, ఎన్ని ఫిర్యాదులు వచ్చిన తనకేం కాదని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరు మంత్రులు పాల్గొన్న సమీక్షలో రెండో వరుసలోనే కూర్చుని అనధికార దర్పాన్ని ఒలకబోయగా…ఇతర అధికారులు గంగాధర్ ముందు చేతులు ముడుచుకుని నిల్చోవాల్సి వచ్చింది. సమీక్ష సమావేశంలో అసలు గంగాధర్ ఎవరో తెలియక వేదికపైకి ఆహ్వానించకపోతే పిలువమని చెప్పి మరీ పిలిపించారంటే…గంగాధర్ హవా ఎలా నడుస్తుందో…అర్థం అవుతుంది.
సీఎం ఆదేశాలు బేఖాతరు…
రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పిఎలు, ఓఎస్డీల విషయంలో సీఎం దృష్టి సారించారు. మంత్రులు ఎవరు తమ ఇష్టానుసారంగా ఓఎస్డీ, పిఎలను నియమించుకోకూడదని, ఆదేశాలు జారీ చేశారు. తానే స్వయంగా నియమిస్తానని చెప్పి ఆ పనిని చేసి చూపించారు. అయితే ఈటలతోపాటు మెజార్టీ మంత్రులు సీఎం కేటాయించిన వారితోపాటు వారికి అనుకూలమైన వారిని నియమించుకున్నారు. ఈ విధానం నిజంగా సీఎం ఆదేశాలను బేఖాతరు చేసినట్లేనని, సీఎం నియమించిన వారికంటే అనధికార ఓఎస్డీల పెత్తనం నడుస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇన్ని విమర్శలు, ఆరోపణలు వస్తున్న మంత్రి ఈటల మాత్రం గంగాధర్‌పై ఎనలేని ప్రేమను కనబరుస్తున్నాడు. ఇతగాడిపై మంత్రి ఈటలకు ఎందుకంత ప్రేమో…తెలియడం లేదు.