అమాత్య మీతో మాకేం పేచి…?

అమాత్య మీతో మాకేం పేచి…?

చెన్న రామకృష్ణ

నేటిధాత్రి, చీఫ్‌ బ్యూరో

గత కొద్దిరోజులుగా ఈటెల రాజేందర్‌ పేషిపై వస్తున్న కథనాలపై కొంతమంది గిట్టనివారు తమ పెత్తనం ఎక్కడ పోతుందోనని భయపడుతున్న వారు పనికి మాలిన ప్రచారాలకు దిగుతున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి పేషిలో అనదికారికంగా ఓఎస్డీలమంటూ రాజ్యమేలుతూ ప్రతి పనికి రేటు అన్న చందంగా వ్యవహారిస్తూ షాడో మంత్రిలా ప్రవర్తిస్తున్న వీరి బాగోతాన్ని బయటపెడుతూ అవినీతిని ఎండగడుతుంటే కొందరికి ఎంతమాత్రం నచ్చడం లేదు. ఈటెల పేషిలో అధికారులమంటూ పాతుకుపోయిన అవినీతి తిమింగళాల గూర్చి ‘నేటిధాత్రి’ ప్రశ్నిస్తూ, మంత్రి వెనకాల జరుగుతున్న గూడుపుఠాణిని ఆయన దృష్టికి తెస్తుంటే మంత్రి పేరుతో పబ్బం గడుపుతూ కోట్ల రూపాయలు సంపాదించి మీడియా పేరుతో ఇప్పటికి ఫోజులు కొట్టాలని చూస్తూ అతి ‘చైతన్య’పు మాటలు మాట్లాడుతున్నాడో వ్యక్తి. కథనాలు పూర్తిగా చదవకుండా ఎంతమాత్రం అవగాహన లేకుండా కథనం ఏ కోణంలో ఉంది. ‘నేటిధాత్రి’ ఏం కోరుకుంటుంది…? ఎవరిని ప్రశ్నిస్తుందో…? కూడా తెలియకుండా ఇంగితం మరచి మంత్రి ఈటెలనే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారంటూ వాట్సప్‌లో మెసేజ్‌లు పంపుతూ, వాట్సప్‌ కాల్స్‌ చేస్తూ ఇతగాడు తన అతితెలివిని ప్రదర్శిస్తున్నాడు. నిజానికి ఈ ప్రైవేట్‌ పైరవీకారుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ‘నేటిధాత్రి’కి లేదు. కానీ నేను ఈటెల ప్రతినిధిని అంటూ అనవసరంగా మంత్రిని సీన్‌లోకి తెస్తున్నాడు. కనుకనే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాం.

మంత్రితో మాకేం పేచి…?

కొంతమంది అరకొర జ్ఞానం. ప్రాథమిక విద్యాభ్యాసం కూడా సరిగ్గా పూర్తి చేసుకుని వారు మంత్రి ఈటెల రాజేందర్‌ను టార్గెట్‌ చేస్తున్నామంటూ మంత్రిపై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. అడ్డగోలు సంపాదన కోసం మంత్రిని, శాఖను అప్రతిష్టపాలు చేయడానికి వెనుకాడకుండా, మంత్రికే తెలియకుండా పేషి నుంచి పైరవీ లేఖలు బయటకు పంపినవారు ఈ ఆరోపణలకు తెగిస్తున్నారు. నిజానికి ‘నేటిధాత్రి’కి ఆరోగ్యశాఖ మంత్రికి మధ్య ఎలాంటి పేచి లేదు. వ్యక్తిగతంగా ఆయనను టార్గెట్‌ చేయాల్సిన అవసరం లేదు. శాఖలో జరుగుతున్న అవినీతి, అనధికార ఓఎస్డీల బరి తెగింపుతనాన్ని తెలియజేస్తూ, శాఖను ప్రక్షాళన చేయమనే మంత్రికి ‘నేటిధాత్రి’ కథనాల ద్వారా సూచిస్తున్నాం. అంతే తప్ప ఎవరి మీద ‘నేటిధాత్రి’కి ద్వేషభావం లేదు. ఒక్క ఈటెల పేషిలోనే కాదు దాదాపు అందరు మంత్రుల పేషిల్లో అనధికార ఓఎస్డీలు, ప్రైవేట్‌ పిఎలు తమ హవాను కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని ‘నేటిధాత్రి’ వరుస కథనాలతో వెలుగులోకి రాబోతుంది. ఇంకా అవి ఏమి రాకముందే కొందరు పనికిమాలిన మాటలను ముందే కూస్తున్నట్లు తెలుస్తోంది. ఈటెల పేషిలో జరుగుతున్న ప్రక్షాళనను చూసి ఓ మంత్రి తన సిబ్బందితో తెల్లవారుజాము దాక తన శాఖ నుంచి అనధికార ఓఎస్డీ పంపిన లేఖలను, ఇతర డాక్యుమెంట్‌లను తొలగించి కంప్యూటర్లను ఫార్మట్‌ చేసారంటే పేషిల్లో ఏం జరుగుతుందో అర్థం అవుతుంది. మంత్రులకు సంబంధం లేకుండా జరుగుతున్న ఈ తతంగాన్ని మంత్రులను మేల్కోని సరిదిద్దుకోండని బయటపెట్టాం తప్ప మంత్రిని టార్గెట్‌ చేయడానికి కాదనేది సుస్పష్టం అవుతుంది. ‘నేటిధాత్రి’ పత్రిక జనం తరుపున వకాల్తా పుచ్చుకుని తన సామాజిక బాధ్యతను నెరవేరుస్తుంది. అన్ని శాఖల్లోకెల్లా అత్యంత కీలకమైన శాఖ ప్రజల ఆరోగ్యం, వారి జీవన్మరణ సమస్యలను పరిష్కారం చేసే శాఖ. అలాంటి శాఖలో ఇలాంటి అవినీతిపరులు, ఉంటే ప్రజల కష్టాలు ఎలా ఉంటాయో ‘నేటిధాత్రి’కి తెలుసు. అందుకే ఇలాంటి వారికి మంత్రి చెక్‌ పెట్టాలనే కథనాలను ప్రచురిస్తున్నాం. ‘జర్నలిజం సమాజానికి జీవం లాంటిది’ అనే విషయాన్ని పూర్తిగా నమ్మిన, జర్నలిజం సామాజిక బాద్యత అని తెలిసిన జర్నలిస్టులతో ‘నేటిధాత్రి’ తన నిఖార్సయిన వార్తల ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అంతేగాని జర్నలిజం పేరుతో దందాలు చేసుకోవడానికి కాదు. చెట్టుపేరు చెప్పి కాయలు కొనే రకాలం అసలే కాదన్న విషయాన్ని పనికిమాలిన కామెంట్లు చేయడానికి సాహసించిన వారందరు గుర్తుంచుకోవాలని చెప్తున్నాం. ఏ మంత్రితో ‘నేటిధాత్రి’కి పేచి లేదు, వ్యక్తిగత తగాదాలు అసలే లేవు. పదవి కోల్పోయేలా చేసి పండుగ చేసుకోవాలన్న దుర్బిద్ది లేదు. కేవలం అవినీతి, అన్యాయాన్ని ప్రశ్నించడమే ‘నేటిధాత్రి’ పని. నిఖార్సయిన వార్తలు, జనానికి అవసరమైన జర్నలిజాన్ని మోసుకుపోవడం, ముందున్న కర్తవ్యం. మేం ఎవరికి బాకాలం కాదు. ఏ రంగు పులుముకోలేదు. ఏ అడుసు తొక్కాలని చూడం ఇది సత్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here