ప్రజా రక్షణే…మా ధ్యేయం

ప్రజా రక్షణే…మా ధ్యేయం

వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో పోలీసులు ప్రజలకు భరోసాను కల్పించడమే కాకుండా నిత్యం నగరంలో శాంతిభద్రతలకై కంటిమీదకునుకు లేకుండా ప్రశాంత వాతావరణం కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నాము. నగరంలో నేరాలను నియంత్రించడం కోసం వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ డి.వి రవీందర్‌ ఆదేశాల మేరకు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ మా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాము. పోలీసులంటే బయపెట్టేవారు కాదు..పోలీసులంటే ప్రజాసేవకులమని నిరూపించుకుంటున్నామని, ఫ్రెండ్లీ పోలీసుతో ప్రజలకు మేము మరింత చేరువయ్యామని, ప్రజలకు పోలీసులపై అపారనమ్మకం ఏర్పడిందని సుబేదారి స ర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.సదయ్య అన్నారు. శుక్రవారం ‘నేటిధాత్రి’ క్రైం ప్రతినిధితో ఇంటర్వూలో పై విదంగా స్పందించారు.

‘నేటిధాత్రి’ : సుబేదారి పరిధిలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి?

సీఐ, సదయ్య : సుబేదారి పరిధిలో శాంతిభద్రతలు చాలా చక్కగా ఉన్నాయి. నిత్యం పెట్రోలింగ్‌ ద్వారా ప్రజలకు రక్షణ కల్పిస్తూ, ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందుగానే పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు.

‘నేటిధాత్రి’ : సీసీ కెమెరాల పట్ల ప్రజల మద్దతు ఎలా లభిస్తున్నది?

సీఐ సదయ్య : నగరంలో సీసీ కెమెరాల ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతున్నది. ప్రతి గల్లీలో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఒక్క సీసీ కెమెరా వందమందితో సమానం. లక్షల రూపాయలు పెట్టి ఇండ్లు నిర్మించుకుంటున్న ప్రజలు అలాగే ప్రతి వాడకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలను తగ్గించడమే కాకుండా దొంగల బారి నుండి కూడా కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయి.

‘నేటిధాత్రి’ : రాత్రి వేళలో పెట్రోలింగ్‌ ఎలా ఉంటున్నది?

సీఐ సదయ్య : సుబేదారి పరిధిలో రెవిన్యూకాలనీ, జూలైవాడ, పోస్టల్‌కాలని, ప్రకాశ్‌రెడ్డిపేట, బ్యాంక్‌కాలని, టీచర్స్‌కాలని, వడ్డేపెల్లి, వికాస్‌నగర్‌, స్నేహనగర్‌, రాంనగర్‌, అంబేద్కర్‌సెంటర్‌ తదితర ప్రాంతాల్లో రాత్రివేళలో ఇంటర్‌సెప్టర్‌ వెహికల్‌ ద్వారా పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు.

‘నేటిధాత్రి’ : ప్రజలకు మీరిచ్చే సలహా?

సీఐ సదయ్య : ప్రజలకు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. పోలీసులకు ఏదైనా సమాచారం అందించాలన్నా, ప్రజలు తమ సమస్యలను పోలీసులకు 100 డయల్‌ ద్వారా సమాచారం అందించవచ్చు. పోలీసులకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం కూడా జరుగుతుంది. పోలీసులంటే ప్రజలకు నిత్యసేవకులు, పోలీసులున్నదే ప్రజలకు రక్షణ కల్పించడానికి, ప్రజలు కూడా పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here