arthikame neramaothunda…?, ఆర్థికమే ‘నేర’మౌతుందా…?

ఆర్థికమే ‘నేర’మౌతుందా…?

ఆర్థిక సమస్యలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. అవసరానికి తీసుకున్న డబ్బులు అప్పుల ఊబిలోకి నెట్టివేస్తే అవే ఆర్థిక అవసరాలు నేరానికి పురిగొల్పుతున్నాయి. అధికవడ్డీలతో చుక్కలు చూస్తూ అవి కట్టలేక కొందరు నేరగాళ్లుగా మారితే, ఇచ్చిన డబ్బులను అధిక వడ్డీతో సహా రాబట్టేందుకు కొందరు ప్రైవేట్‌ ఫైనాన్సర్స్‌ నేరగాళ్లుగా మారుతున్నారు. ఇంకొందరైతే వ్యాపారాలు పెట్టే తమతో ఉన్న భాగస్వాములను నమ్మి లక్షల్లో పెట్టుబడి పెట్టి లెక్కలు తేలక భాగస్వామి చేతిలో మోసపోయి దిక్కుతోచని స్థితిలో పగతో రగిలిపోయేవారు ఉన్నారు. వీరందరిని చేరదీసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ‘చిచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమనే’ చందంగా సందట్లో సడేమియాల్లాగా కొంతమంది రాజకీయ నాయకులు దూరి పర్సంటేజిలతో పనులు కానిచ్చేస్తున్నారు. అప్పులు ఎగ్గొట్టేవారికి వీరు అండదండగా ఉంటున్నారు. అధిక వడ్డీల విషయంలో మాత్రం ప్రైవేట్‌ ఫైనాన్సర్స్‌ల తరపున వకాల్తా పుచ్చుకుని పేదప్రజల ఉసురుపోసుకుంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ఆర్థికమే నేరంగా మారుతుంది. మనిషి ప్రాణాలుపోయే వరకు వస్తోంది. ‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తిస్తారు. వారికి ఏదో సహాయం చేస్తున్నట్లుగా..తీర్చలేని వడ్డీలకు అప్పులు ఇస్తారు. కొంతకాలం తర్వాత తమ అప్పు తీర్చాలంటూ వారి పీకలమీద కూర్చుంటారు. ఒకవేళ తీర్చలేకపోతే బాధిత మహిళలను, వారి కుటుంబంలోని మహిళలను తమ లైంగిక అవసరాలు తీర్చమని బలవంతం చేస్తారు. అలా కాని పక్షంలో ఇళ్లుపీకి పందిరేస్తామని బెదిరిస్తారు. తమకు పోలీసు, రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి…బాధితుల ఎదురుగానే వారితో ఫోన్లో మాట్లాడుతారు. దీంతో ఇష్టం లేకపోయినా రౌడీలు వస్తే ఎక్కడ తమ పరువుపోతుందనే భయంతో వ్యాపారులు చెప్పినట్లు చేస్తారు. దీనిని వీడియో తీసి బాధితుల కుటుంబంలోని యువతులను కూడా తమ దారికి తెచ్చుకుంటారు. ఇదీ వరంగల్‌ నగరంలోని వ్యవహారం. ప్రస్తుతం ఇదే హాట్‌టాపిక్‌. ఇప్పటివరకూ బయటకు పొక్కకపోయినా నగరంలో ఇలాంటి తతంగమే నడుస్తున్నదని చెప్పొచ్చు. రామన్నపేట, కాశిబుగ్గ, కరీమాబాద్‌, రంగశాయిపేట, ఎస్‌ఆర్‌ఆర్‌తోట, గిర్మాజీపేట ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నగరంలో ఇదే ఫార్ములాను అమలుచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు దీనిపై లోతుగా దష్టి సారిస్తే ఇలాంటి సంఘటనలు బయటకు రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి నివాసముంటున్నారు. వీరితోపాటు నగరానికి చెందిన అనేకమంది పేద, మధ్యతరగతి ప్రజలు, చిరువ్యాపారులు తరచూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంటారు. దీంతో వీరంతా వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రుణాలు తీసుకుంటూ ఉంటారు. నగరానికి చెందిన వారితోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఫైనాన్స్‌ వ్యాపారులు ఇలాంటి వారందరికీ రోజువారీ, వారం, నెలవారీ వాయిదాల తీర్మానంపై అప్పులు ఇస్తుంటారు. ఇందుకోసం తీసుకునే వారి అవసరాన్ని బట్టి వడ్డీ రూ.10నుంచి రూ.15 వరకూ వసూలు చేస్తుంటారు. ఇది ఒకవిధంగా అప్పు తీసుకునే వారికి భారమే అయినప్పటికీ మరో ప్రత్నామ్నాయం లేకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిస్తూ వారి ఊబిలో చిక్కుకుంటున్నారు.

నగరంలో వందకుపైగా ఫైనాన్షియర్లు

నగరంలో ఫైనాన్స్‌ ఇచ్చే వ్యాపారుల సంఖ్య వందకుపైగానే వుంటుంది. వీరిలో ఎక్కువ మంది గ్రేటర్‌ వరంగల్‌కి చెందినవారేనని చెప్పొచ్చు. ఆయా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నగరంలో ఏదో ఒకచోట ఇళ్లు అద్దెకు తీసుకుని కార్యాలయంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా కలెక్షన్‌ చేసే వారిని నియమించుకుంటున్నారు. ఉదయాన్నే కార్యాలయానికి వచ్చి ముందురోజు కలెక్షన్లను తీసుకువచ్చే బాయ్స్‌ నుంచి కట్టించుకుంటారు. తర్వాత రికార్డులను సరిచేసుకుని తమ కలెక్షన్‌ బాయ్‌లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫైనాన్స్‌ తీసుకోవాలనుకుంటున్న వారి ఇళ్లకు వెళతారు. అవతలివారి అవసరాన్ని బట్టి వడ్డీలను నిర్ణయించి ఖాళీ ప్రామిసరి నోటు తీసుకుని అప్పులు ఇస్తుంటారు. సాయంత్రం కాగానే కార్యాలయానికి తాళం వేసి తిరిగి వెళతారు. ఇలా ఫైనాన్స్‌ చేస్తున్న వారు నగరంలో వందకుపైగా వుంటారని అంచనా.

వ్యాపారులకు కొంతమంది రాజకీయ నేతల దన్ను

ఫైనాన్స్‌ వ్యాపారులకు నగరంతోపాటు వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న కొంతమంది ఖాకీలు, రాజకీయ నేతల అండదండలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాకీ కట్టలేని వారి పట్ల వ్యాపారులు తమదైన వ్యూహాన్ని అమలుచేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా తమ దారికి రాకపోతే వారి ఎదురుగానే తమకు పరిచయం ఉన్న పోలీసులు, రాజకీయ నాయకులకు ఫోన్‌చేసి అత్యంత చనువుగా మాట్లాడుతారు. దీంతో బాధితులు భయపడి వ్యాపారుల ఆగడాలను బయటకు చెప్పలేక లోలోనే కుమిలిపోతున్నారు. ఒకవేళ ఎవరైనా ఎదిరిస్తే రౌడీలను వారి ఇళ్లపైకి పంపించి నానా బీభత్సం సష్టించి భయాందోళనకు గురిచేస్తుంటారు. ఇంట్లోని సామాన్లను వీధిలో పడేస్తుంటారు.

మరికొందరైతే భౌతికదాడులకు దిగి బాధితులకు ఉన్న ఆస్తులను వ్యాపారులకు రాసి ఇచ్చేసినట్లు బలవంతంగా సంతకాలు చేయించుకుంటారు. దీనిపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ ఫిర్యాదులు లేనందున తామేమీ చేయలేమంటూ మిన్నకుండిపోతున్నారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై పోలీసులు ఇప్పటికైనా దష్టిసారిస్తే నగరంలో చోటుచేసుకున్న సంఘటనలు పునరావతం కాకుండా నియంత్రించేందుకు వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బాకీ తీర్చలేకపోతే అరాచకమే..

అవసరం కనుక వడ్డీ గురించి ఆలోచించకుండా అప్పులు తీసుకున్నవారు తిరిగి కట్టేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. దినసరి కూలీలు, చిరువ్యాపారులు కావడంతో వాయిదాలను సక్రమంగా చెల్లించే పరిస్థితి ఉండదు. దీంతో వ్యాపారులు తమ బాకీలపై వడ్డీలకు చక్రవడ్డీలను కలిపి బాధితులకు తలకు మించిన భారాన్ని చూపి తీర్చమని ఒత్తిడి తెస్తారు. తీర్చలేకపోతే బాధితులకు ఉన్న ఆస్తులపై కన్నేసి తక్కువ మొత్తానికి వాటిని సొంతం చేసుకుంటారు. బాధితులకు ఆస్తులు ఏవీ లేకపోతే వారి ఇంట్లో ఉండే మహిళలపై వ్యాపారుల కన్నుపడుతుంది. అందంగా ఉన్న వారుంటే అప్పును బూచిగా చూపి వారిని లోబరుచుకునేందుకు పావులు కదుపుతారు. అలా కానిపక్షంలో రౌడీలను పంపించి ఇంట్లోని వస్తువులను ఎత్తుకుపోతామని, వస్తువులను వీధిలో పడేస్తామని బెదిరిస్తారు. ఆ విధంగా జరిగితే చుట్టుపక్కల వారి దగ్గర పరువుపోతుందనే భయంతో వ్యాపారులు చెప్పినట్లు చేస్తున్నారు. వాటిని వీడియో తీసి వారి కుటుంబంలో ఎవరైనా యువతులు వుంటే వారికి వీడియోలను చూపిస్తామని బెదిరించి ఆ యువతులను కూడా తమదారికి తెచ్చుకుంటున్నారు. అయితే దీనిపై బాధితులు ఇప్పటివరకూ ఫిర్యాదు చేసిన సందర్భాలు లేకపోయినా ఇదంతా గుట్టుగా సాగుతున్న వ్యవహారమేనని కొంతమంది బాధితులు పేర్కొనడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here